Indrakeeladri Dasara: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన అమ్మవారి జన్మ నక్షత్రం 'మూలా నక్షత్రం' పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం సాయంత్రం సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు సీఎం చంద్రబాబు దంపతులకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలి. వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు కాటకాలను అధిగమించే శక్తిని రాష్ట్రానికి ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని కోరుకున్నాను" అని తెలిపారు. కాగా, ఆలయంలో సీఎం దర్శనం చేసుకుంటున్న సమయంలో కొంతమంది భక్తులు "జై బాబు" అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, ఆలయ ప్రాంగణంలో వ్యక్తిగత నినాదాలు వద్దని భక్తులను వారించారు. అనంతరం సీఎం సూచనతో భక్తులంతా ఒక్కసారిగా "జై భవానీ.. జై జై భవానీ" అంటూ నినాదాలు చేశారు.

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు

మూలా నక్షత్రం విశిష్టత: దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు అమ్మవారు చదువుల తల్లి 'శ్రీ సరస్వతీ దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానం, విద్య లభిస్తాయని భక్తుల విశ్వాసం. మూలా నక్షత్రం కావడం, సరస్వతీ దేవి అలంకారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు విజయవాడకు పోటెత్తారు.

ప్రత్యేక క్యూలైన్లు

సామాన్య భక్తుల దర్శనానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. కొండపైకి వాహనాల రాకపోకలను నియంత్రించి, వృద్ధులు, వికలాంగుల కోసం ఉచిత బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, పాలు, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఏసీపీలు, సీఐలు, 3000 మందికి పైగా పోలీసులతో పటిష్టమైన భద్రతా బందోబస్తు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. వినాయక గుడి వద్ద నుండి కొండపైకి వెళ్లే మార్గమంతటా వైభవంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

Also Read: సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి వైభోగం చూడండి ! అక్టోబర్ 16 ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడసేవ!