న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాతో పాటు సముద్ర వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళే అనేక దేశాల నౌకలతో పాటు భారత్‌కు చెందిన అనేక నౌకలు కూడా చిక్కుకుపోవడానికి ఇదే కారణం. నేడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండు LPG ట్యాంకర్ షిప్‌లు శివాలిక్, నందా దేవి హర్మూజ్ జలసంధిని దాటి భారతదేశానికి బయలుదేరాయి.

రెండు షిప్‌లలో శివాలిక్ ఓడ దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల నేచురల్ గ్యాస్‌ను భారత్‌కు తీసుకువస్తోంది. నందా దేవి షిప్ కూడా పెద్ద మొత్తంలో ఇంధనాన్ని తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిలో ఎన్ని ఇండియన్ షిప్స్ లు చిక్కుకున్నాయి, వాటిలో దేశానికి ఏమేం వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

గల్ఫ్ ప్రాంతంలో 28 ఇండియన్ షిప్స్

భారత ప్రభుత్వం చెబుతున్న ప్రకారం, ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 28 దేశానికి చెందిన షిప్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 778 మంది భారత నావికులు ఉన్నారు. వీటిలో 24 నౌకలు హర్మూజ్ జలసంధి పశ్చిమ భాగంలో ఉన్నాయి. వీటిలో 677 మంది నావికులు ఉన్నారు. 4 ఓడలు జలసంధి తూర్పు భాగంలో ఉన్నాయి. వాటిలో 101 మంది భారత నావికులు ఉన్నారు. ఈ నౌకలన్నింటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచామని, వాటి భద్రత కోసం భారత రాయబార కార్యాలయం, అధికారులు, షిప్పింగ్ కంపెనీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

కొన్ని ఓడలలో గ్యాస్, ముడిచమురు

జలసంధిలో చిక్కుకున్న షిప్‌లలో భారతదేశానికి చెందిన రెండు LPG ట్యాంకర్లున్న ఓడలు విజయవంతంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను దాటాయి. హర్మూజ్‌లో చిక్కుకున్న చాలా మంది భారత ఓడలలో నేచురల్ గ్యాస్, ఇంధనం ఉన్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఆగ్రహించిన ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్ లో ముడి చమురు షిప్స్, ఇతర ఓడల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో దేశానికి చెందిన రెండు నౌకలకు అనుమతి లభించడంతో పాటు, హర్మూజ్ జలసంధి నుంచి జగ ప్రకాష్ అనే మరో భారత ట్యాంకర్ ఒమన్ నుండి పెట్రోల్ తీసుకుని ఆఫ్రికా వైపు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

ఉద్రిక్తతల కారణంగా సముద్ర మార్గంలో ఆటంకాలు
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత పశ్చిమ ఆసియా(వెస్ట్ ఆసియా)లో ఉద్రిక్తత పెరిగింది. ఆ తరువాత ఇరాన్ ప్రతిస్పందన చర్యగా ఎదురుదాడులు ప్రారంభించింది. దీని ప్రభావం సముద్ర వాణిజ్యంపై కూడా పడింది. సరుకు రవాణా చేస్తున్న షిప్‌లపై దాడులు జరిగాయి. కొన్నింటిని సబ్ మెరైన్ సాయంతో పేల్చివేయగా, కొన్నింటిపై డ్రోన్, మిస్సైల్ దాడులు జరిగాయి. ఆ కారణంగా ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు మార్గాలలో ఒకటైన హర్మూజ్ ప్రభావితమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం చమురు, గ్యాస్ షిప్స్ ఇదే మార్గం నుంచి వెళ్తుంటాయి. అందువల్ల, ఇక్కడ ఏర్పడిన ఉద్రిక్తత పలు దేశాల్లో ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. భారత్‌లో పలు నగరాల్లో సీఎన్జీ కష్టాలు మొదలయ్యాయి.