IND vs PAK Champions Trophy 2025: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈనెల 23న భార‌త్ త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దుబాయ్ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. భార‌త్ ఆడ‌బోయే లీగ్ మ్యాచ్ ల‌న్నీ ఈ మైదానంలోనే జ‌ర‌గ‌బోతున్నాయి. ఈనెల 20న బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆల్రెడీ దీనిపై భార‌త్ కు అవ‌గాహ‌న వ‌చ్చేసింది. తాజాగా రోహిత్ శ‌ర్మ పిచ్ గురించి వ్యాఖ్యానించాడు. పాక్ తో జ‌ర‌గ‌బోయే పోరులో పిచ్ ఎలా స్పందిస్తుందో అని వ్యాఖ్యానించాడు. పిచ్ నెమ్మ‌దిగా ఉండే అవ‌కాశ‌ముంద‌ని తెలిపాడు. గురువారం బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల‌తో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఛేద‌న చాలా క‌ష్ట‌మైన ద‌శ‌లో భార‌త ప్లేయ‌ర్లు అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా ప్రిన్స్, ఓపెన‌ర్ శుభ‌మ‌న్ గిల్ (101 నాటౌట్) అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అత‌నికి కేఎల్ రాహుల్ (41 నాటౌట్) చ‌క్క‌ని స‌హ‌కారం అందించ‌డంతో భార‌త్ కాస్త సునాయ‌స విజ‌య‌మే సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో తాము అనుకున్న‌ట్లుగా పిచ్ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని రోహిత్ వాపోయాడు. నిజానికి టాస్ ఓడి ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. అయితే తాము టాస్ గెలిస్తే కూడా బౌలింగ్ తీసుకునే వాళ్ల‌మ‌ని, మంచు, వెలుతురులో ఛేజింగ్ ఈజీ అవుతుంద‌ని భావించామ‌ని, అయితే అలా జ‌ర‌గ‌లేద‌ని తెలిపాడు.

నెమ్మ‌దించిన పిచ్..
రెండో ఇన్నింగ్స్ లో పిచ్ చాలా నెమ్మ‌దించిందని, పిచ్ పై ప‌చ్చిక బాగా లేక‌పోవ‌డంతో స్పిన్న‌ర్ల‌కు అనుకూలించింద‌ని, అనూహ్యంగా ట‌ర్న్ అవుతూ, బ్యాటింగ్ కు స‌వాలుగా నిలిచింద‌ని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా పాక్ తో జ‌రిగే కీల‌క‌పోరులో పిచ్ గురించి అవగాహ‌న‌కు రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. టోర్నీ మొత్తం ఒకే పిచ్ పై ఆడ‌టం ఇండియాకు అడ్వాంటేజీ అని, దీని వ‌ల్ల భార‌త జ‌ట్టు లాభ‌ప‌డుతుంద‌న వ్యాఖ్యానిస్తున్నారు.

ఓడితే టోర్నీ నుంచి ఔట్..
భార‌త్ తో జ‌రిగే మ్యాచ్ పాక్ కు చావోరేవోలాంటిది. ఈ మ్యాచ్ లో ఓడితే, టోర్నీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన మొట్ట‌మొద‌టి జ‌ట్టుగా నిలుస్తుంది. ఇప్ప‌టికే న్యూజిలాండ్ చేతిలో భారీ తేడాతో ఓడిన పాక్.. భార‌త్ చేతిలో కూడా ఓడిపోతే టోర్నీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. నిజానికి బంగ్లాతో చివ‌రి లీగ్ మ్యాచ్ ఉన్న‌ప్ప‌టికీ, అందులో భారీ తేడాతో గెలిచినా, టోర్నీలో ముందుకు పోవ‌డానికి చాలా స‌మీక‌ర‌ణాలు క‌లిసి రావాలి. మొత్తానికి చాంపియ‌న్స్ ట్రోఫీలో విజ‌యాల విష‌యంలో పాక్ పై చేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు జరిగిన మ్యాచ్ ల ఫ‌లితాల‌ను విశ్లేషించినట్ల‌యితే 3-2తో ఆధిక్యంలో పాక్ ఉంది. చివ‌రి సారిగా 2017 టోర్నీ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌గా, భార‌త్ ఘోర ప‌రాజయం పాలైంది. ఆదివారం జ‌రిగే మ్యాచ్ లో విజ‌యం సాధించి లెక్క స‌రిచేయ‌డంతోపాటు నాకౌట్ కు చేరుకోవాల‌ని భావిస్తోంది. గతంలో రెండుసార్లు ఈ మెగాటోర్నీ ని 2002, 2013 లో భారత్ సాధించింది.

Read Also: Champions Trophy: గిల్‌ సెంచరీతో హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్న గనెటిజన్లు