T20 World Cup Ind vs Pak | కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో తొలి 2 మ్యాచులు స్వదేశంలో ఆడిన టీమిండియా నెక్ట్స్ మ్యాచ్ శ్రీలంకలో ఆడుతుంది. అందుకు కారణం పాకిస్తాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టీమిండియాతో కీలక మ్యాచ్ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగాలని తాను కోరుకుంటున్నానని, అత్యుత్తమ జట్టుతో తాము పోటీ పడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

టీ20 ప్రపంచ కప్‌‌లో భారత్, పాక్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియా టీం శుక్రవారం అర్ధరాత్రి కొలంబో చేరుకుంది. ఫిబ్రవరి 15న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ పాక్‌తో జరిగే మ్యాచులో ఆడాలని కోరుకుంటున్నాను. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైనదే, ఎలాంటి లోపాలు లేవన్నాడు.

యుఎస్ఏతో మ్యాచ్‌కు ముందే అభిషేక్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు. కానీ భారత ఓపెనర్ ఆ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఆసుపత్రిలో 2 రోజులు చికిత్స తీసుకున్నాడు. అయితే నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు ముందు అతను జట్టుతో తిరిగి కలిశాడు. కానీ బరిలోకి దిగలేదు. సంజూ శాంసన్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా మాట్లాడుతూ, అభిషేక్‌ను మైదానంలో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మేం అత్యుత్తమ టీమిండియాతో తలపడాలి అనుకుంటున్నామని తెలిపాడు.

అభిషేక్ గురించి పాకిస్తాన్ కెప్టెన్ ఏమన్నాడంటే

"భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుంటున్నాడని విన్నాం. పాక్‌తో జరిగే మ్యాచ్ ఆడతాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మేం బెస్ట్ టీంతో పోటీ పడి నెగ్గాలి అనుకుంటున్నాం" అని సల్మాన్ ఆగా అన్నాడు. కోట్లాది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి వస్తున్న ప్రశ్నలపై సల్మాన్ అలీ స్పందించాడు. "ఐసీసీ నిర్వహించిన పరీక్షలో తారిక్ 2 సార్లు పాస్ అయ్యాడు. అంటే అతడు క్లియర్‌గా ఉన్నాడు. అతడి బౌలింగ్ గురించి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మా బౌలర్ ఉస్మాన్ తారిక్‌ ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే అతడు కెరీర్ ప్రారంభించినప్పటి నుండి అతని బౌలింగ్ యాక్షన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటివి విని వదిలేయడం అతడికి సైతం అలవాటైపోయింది” అన్నాడు.

ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇంతకు ముందు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచులో ఇండియా 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముఖాముఖీ పోరులో ప్రత్యర్థి పాక్ జట్టుపై భారత్ పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 13 భారత్ గెలిస్తే, 3 పాకిస్తాన్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే ఇప్పటివరకూ 8 సార్లు దాయాది జట్లు తలపడగా భారత్ 7 సార్లు, పాక్ ఒక మ్యాచ్ నెగ్గాయి.