Asia cup 2025 India vs bangladesh | ఆసియా కప్ 2025 సూపర్-4లో నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియా మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోవాలని భావిస్తుంది. బంగ్లాదేశ్ కూడా శ్రీలంకను ఓడించి ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. దీనిని టోర్నమెంట్‌లో ఒక బలమైన జట్టుగా పరిగణిస్తున్నారు. కనుక నేడు బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉత్కంఠభరితమైన పోరును ఆశించవచ్చు. అయితే అభిమానులు మ్యాచ్ ఇది హైవోల్టేజ్ డ్రామాగా మారుతుందా అని చర్చించుకుంటున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టులాగే, బంగ్లాదేశ్ కూడా భారత్‌తో మ్యాచ్‌ల సందర్భంగా చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంది. ఈ 2 జట్లు ఎదురుపడినప్పుడల్లా చాలా వివాదాలు జరిగాయి. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటలు, తీవ్ర వాగ్వాదాలకు దారి తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది.

2015 వన్డే ప్రపంచ కప్‌లో వివాదం

2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ భారత్, బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వివాదం తలెత్తింది. బంగ్లా ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కాని అంపైర్ దీనిని నో బాల్‌గా ప్రకటించాడు. రీప్లేలో ఇది తప్పు అని తేలడంతో బంగ్లా జట్టు, బోర్డు చాలా అసంతృప్తికి గురయ్యాయి. అంపైర్ తప్పిదంతో తమ ఓడిపోయామని బంగ్లా వ్యాఖ్యానించింది. భారత్ ఈ మ్యాచ్‌లో 109 పరుగుల తేడాతో గెలిచింది.

ఎంఎస్ ధోనీ తల నరికినట్లుగా ఫోటో

ఇది ఆసియా కప్ 2016 నాటి ఘటన. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ అభిమానులు ఒక ఫోటోను వైరల్ చేశారు. ఇందులో బంగ్లాదేశ్ క్రికెటర్ ఒకరు అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల నరికినట్లుగా ఉంది. దీనిపై చాలా వివాదం చెలరేగింది. ఇది కూడా ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణను మరింత పెంచింది.

విరాట్ కోహ్లీతో రుబెల్ హుస్సేన్ గొడవ

విరాట్ కోహ్లీ, రుబెల్ హుస్సేన్ మధ్య మాటలు హద్దులు దాటాయి. మైదానంలో వీరి మధ్య వాగ్వాదం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి రుబెల్ భారత బ్యాటర్ కోహ్లీని మైదానం నుండి వెళ్లిపోవాలని సైగ చేశాడు. 2022 టీ20 ప్రపంచ కప్‌లో నూరుల్ హసన్ విరాట్ కోహ్లీపై ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు చేశాడు. ఇది రుజువైతే భారత్‌కు 5 పరుగులు పెనాల్టీ విధించేవారు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఫేక్ ఫీల్డింగ్ అని బంగ్లా లేనిపోని వివాదానికి దిగింది.

కోహ్లీని అవుట్ చేసి సంబరాలు

2015 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో రుబెల్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని 3 పరుగులకు అవుట్ చేశాడు. కోహ్లీ అతని దగ్గరకు రాగానే, బంగ్లా బౌలర్ రుబెల్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అది భారత ఫ్యాన్స్ వర్సెస్ బంగ్లా క్రికెటర్స్, ఫ్యాన్స్ గా మారేలా చేసింది.

అండర్-19 ప్రపంచ కప్‌లో కొట్టుకునేలా..

అండర్-19 ప్రపంచ కప్ 2020లో భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య చాలా వాగ్వాదాలు జరిగాయి. ఫైనల్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు భారత ఆటగాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే కొట్టుకునే పరిస్థితి వచ్చింది, ఇరు జట్ల ఆటగాళ్లు చేతుల్లో స్టంప్స్, బ్యాట్‌లతో నిలబడ్డారు.

భారత్, బంగ్లాదేశ్ లైవ్ మ్యాచ్‌ ఎక్కడ చూడాలి?

భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్‌ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో చూడవచ్చు.