ICC Champions Trophy 2025 Latest Updates: దుబాయ్ లో మంగ‌ళ‌వారం జ‌రిగే సెమీస్ లో టీమిండియా ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతుంద‌ని దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గావ‌స్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే ఈ వేదిక‌పై మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు అక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పుకొచ్చాడు. భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల టీమిండియా.. మెగా టోర్నీలో హైబ్రీడ్ మోడ‌ల్లో ఆడుతోంది. దుబాయ్ లోనే మూడు లీగ్ మ్యాచ్ లు ఆడిన భార‌త్.. ఆసీస్ తో సెమీస్ కు కూడా అక్క‌డే ఆడ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైన‌ల్ మ్యాచ్ ను కూడా దుబాయ్ లోనే ఆడుతుంది. ఈ నేప‌థ్యంలో ఒకే వేదిక‌పై మ్యాచ్ లు ఆడ‌నుండ‌టంతో టీమిండియాకు అది లాభ‌దాయ‌కంగా మారింద‌ని గావ‌స్క‌ర్ చెప్పుకొచ్చాడు. మెగాటోర్నీలో భార‌త్ మాత్ర‌మే మూడింటికి మూడు గెలిచి అజేయంగా నిలిచింది. ఈ క్ర‌మంలో సెమీస్ లో అడుగుపెట్టి, ఆసీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ సెమీస్ కు మ్యాచ్ కు ముందు భార‌త్ కు గావ‌స్క‌ర్ ఒక స‌ల‌హా ఇచ్చాడు.

ఛేజ్ చేయండి..
ఈ పిచ్ పై టాస్ గెలిస్తే ఛేజ్ చేయాల‌ని టీమిండియాకు గావ‌స్క‌ర్ సూచించాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో నాణ్య‌మైన స్పిన్న‌ర్లు పెద్ద‌గా లేర‌ని, అలాగే వారి ప్రీమియ‌ర్ బౌల‌ర్లు కూడా అందుబాటులో లేర‌ని గుర్తు చేశాడు. కెప్టెన్ పాట్ క‌మిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్ గాయాల‌తో మెగాటోర్నీకి దూర‌మ‌య్యారు. వీళ్ల స్థానంలో అంత‌గా అనుభ‌వం లేని ముగ్గురు పేస‌ర్లు ఆడుతున్నారు. ఆడం జంపా రూపంలో మాత్ర‌మే వారికి ఒక స్పిన్న‌ర్ అందుబాటులో ఉన్నాడు. దీంతో ముందుగా బౌలింగ్ చేసి ఛేజ్ చేస్తేనే భార‌త్ కు లాభిస్తుంద‌ని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆడిన జ‌ట్టుతోనే సెమీస్ లో బ‌రిలోకి దిగాల‌ని సూచించాడు.

అసాధ్య‌మేమీ కాదు..
టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్ లో 250 ప‌రుగుల ఛేద‌న అసాధ్య‌మేమీ కాద‌ని, భార‌త స్పిన్న‌ర్లు రాణించి, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించార‌ని గావ‌స్క‌ర్ గుర్తు చేశాడు. స్పిన్న‌ర్ల‌కు తొలుత మ‌ద్ధ‌తు ల‌భించ‌లేద‌ని, రోలింగ్ చేశాక‌, ల‌భించిన స‌పోర్టుతో స్పిన్న‌ర్లు చెల‌రేగి పోయార‌ని ప్ర‌శంసించాడు. ఇక సెమీస్ కు జ‌ట్టులో మార్పులేమీ చేయ‌వ‌ద్ద‌ని సూచించాడు. ఐసీసీ చాంపియ‌న్స్ టోర్నీ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. కేవ‌లం మూడు మ్యాచ్ లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. మంగ‌ళ‌వారం దుబాయ్ లో ఆసీస్ తో టీమిండియా, బుధ‌వారం సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి.ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9న) జ‌రుగుతుంది. 2002, 2013లో రెండుసార్లు మెగాటోర్నీని నెగ్గిన టీమిండియా.. 2017 ఫైనల్లో మాత్రం పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఇందుకు ప్రతీకారంగా ఈ ఎడిషన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో 6 వికెట్లతో ఓడించి, ఏకంగా టోర్నీ నుంచే సాగనంపింది. ఈసారి కప్పు కొట్టి మూడోసారి ఈ టోర్నీని నెగ్గిన తొలి కంట్రీగా ఆవిర్భవించాలని భారత్ భావిస్తోంది.

Read Also: Varun Chakravarthy: వ‌న్డేల్లొ కొత్త వ్యూహంతో ఆడుతున్న వ‌రుణ్.. 5 వికెట్ హాల్ తో విజృంభ‌ణ‌.. జ‌ట్టు సెలెక్ష‌న్ లో త‌ల‌నొప్ప‌లు..!!