Illu Illalu Pillalu Serial Today Episode చందు శ్రీవల్లిని పుట్టింట్లో వదిలేయడంతో శ్రీవల్లి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. భాగ్యం, ఇడ్లీబాబాయ్ కూతురు ఏడుస్తూ ఉండటం చూసి ఏమైందమ్మా.. ఈ బ్యాగ్ ఏంటి.. ఇందుకు ఇలా ఏడుస్తున్నావ్ అని అడుగుతారు. దానికి శ్రీవల్లి ఇంకా అర్థమై చావలేదా.. నా కాపురం కూలిపోయింది.. నా చదువు విషయమే కాదు.. విశ్వక్, అమూల్యల మధ్య రాయభారం చేసింది మొత్తం ఆ ప్రేమ, నర్మదలు నా భర్తకి చెప్పేశారు అని చెప్తుంది.

భాగ్యం కూతురితో ఆ నర్మద, ప్రేమలు మంచోళ్లు కదే.. నిన్ను ఏదో బెదిరిస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గం చేస్తారా అని అంటుంది. చేసింది అంతా మీరు అయితే వాళ్లని అంటారేంటే అని శ్రీవల్లి తల్లి మీదకు చేయి ఎత్తుతుంది. అబద్ధాలు చెప్పొద్దు మిమల్ని బతిమాలాను.. మోసాలు చేయొద్దు అని వేడుకున్నాను.. కానీ ఏం చేసినా నీ కాపురం కోసం అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు.. మోసాల మీద మోసాలు చేశారు.. ఇప్పుడు నా కాపురం కూలిపోయింది. నాకు భవిష్యత్‌ లేకుండా అయిపోయింది. ఆ భద్రావతి వాళ్లకి మా మామయ్య వాళ్లకి పడదే వద్దే అని చెప్పినా వినకుండా వాళ్ల దగ్గర 10 లక్షలు తీసుకున్నారు.. మీ చేతులతో మీరే నా కాపురం కూలగొట్టారు. నన్ను ప్రాణంగా చూసుకున్న నా భర్తే నన్ను వదిలేసేలా చేశారు.. నా భర్త నన్ను వదిలేస్తే నేను బతకలేను.. నేను బతకను అని ఏడుస్తుంది.

రామరాజు ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు మొదలవుతాయి. పంతులు రామరాజుతో ఈ ఏడాది మీరే కల్యాణం జరిపిస్తారా మీ కోడళ్లలో ఎవరైనా జంట కూర్చొంటారా అని అడుగుతారు. నా కోడళ్లు వచ్చిన తర్వాత ఇది మొదటి శ్రీరామనవమి.. అందుకే నా పెద్ద కొడుకు చందు, సాక్ష్యాత్తు మహాలక్ష్మీ అయిన నా కోడలు శ్రీవల్లి మాతో పాటు కూర్చొంటారని రామరాజు చెప్తాడు. చందు, వల్లీ అక్కడ లేరు అని వేదవతి తల్లి చెప్పడంతో నర్మద, ప్రేమలు మేం తీసుకొస్తామని చెప్పి వెళ్తారు. గదిలో ఇద్దరూ లేకపోవడంతో ఏమైంది.. ఏమైనా గొడవ అయిందా అని అనుకుంటారు. ఇద్దరూ పూజ దగ్గరకు వెళ్తారు.. రామరాజు, వేదవతి ఇద్దరినీ తీసుకొస్తా అని చెప్పి మీరే వచ్చారు.. వాళ్లేరి అని అడుగుతారు. ఇంతలో చందు వస్తాడు. రామరాజు కొడుకుతో కోడలు ఎక్కడికి వెళ్లిందిరా అని అడిగితే ఇంట్లో లేదు నాన్న.. నేనే తనని వాళ్ల పుట్టింట్లో వదిలేసి వచ్చా అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.

వల్లీని వాళ్ల పుట్టింట్లో వదిలేసి రావడం ఏంటి.. అని రామరాజు, వేదవతి అడుగుతారు. వల్లీ వాళ్ల అమ్మ కాలు జారి కింద పడిపోయింది.. వల్లీ టెన్షన్ పడుతుంటే తీసుకెళ్లి వదిలేసి వచ్చా అని అంటాడు. ఇక చందు కూడా అర్జెంటుగా రైస్ మిల్లుకి వెళ్లాలి.. బియ్యం లోడు వచ్చిందని చెప్పి చందు బయటకు వెళ్లిపోతాడు. నర్మద, ప్రేమలు కూడా చందు వెనకాలే వెళ్తారు. చందుని పిలిచి కరెక్ట్ కాదు బావ..వల్లీ అక్క గురించి మీకు తెలియాలి అనుకున్నాం కానీ.. తనకి మీరు బుద్ధి చెప్తారు అనుకున్నాం.. అంతే కానీ తన కాపురం సమస్యల్లో పడాలి అని అనుకోలేదు.. వల్లీ గురించి మీరు మామయ్యకి అర్థమయ్యేలా చెప్తారని అనుకున్నాం.. మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటారని అనుకున్నాం అంతే కానీ ఇలా ఎందుకు పుట్టింట్లో వదిలేశారు అని అడుగుతారు. నేను సరైన నిర్ణయం తీసుకున్నాను.. వల్లీ గురించి ఇంట్లో వాళ్లకి తెలిస్తే నా మీద ఒట్టే అని చందు వెళ్లిపోతాడు.

వల్లీ గురించి ఆలోచిస్తూ చందు చాలా బాధ పడతాడు. ఒంటరిగా నడుచుకుంటూ వల్లీ ఇలా ఎలా చేశావ్.. నా ప్రాణం అనుకున్నా.. నా మనసు తీసుకోలేకపోతుంది.. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు ఇంత మోసం చేశావ్.. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నా కదా.. అసలు మా ఫ్యామిలీని ఎలా మోసం చేయాలి అనిపించింది వల్లీ.. మా చెల్లి జీవితం ఎలా నాశనం చేయాలి అనిపించింది.. అని చాలా బాధ పడతాడు. కల్యాణం దగ్గర పంతులు చందు, వల్లీ లేరు కాబట్టి మరో జంటని కూర్చొపెట్టమని రామరాజు వాళ్లకి చెప్తారు. పెద్దోడు లేడు కాబట్టి రెండో కొడుకు, కోడలు కూర్చొంటారని వేదవతి నర్మద, సాగర్‌లను కూర్చొమని అంటుంది. సాగర్, నర్మద కూర్చొగానే రామరాజు లేచేస్తాడు. ఏమైందని వేదవతి అడిగితే వాడు ఈ పూజలో కూర్చొంటే నేను కూర్చొను.. అడ్డుదారిలో ఉద్యోగం తెచ్చుకున్నవాడిని చూస్తూ నేను కూర్చొలేను అని అంటాడు. అయిపోయింది కదా వదిలేయండి అని వేదవతి అంటే నన్ను మోసం చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు అని అంటాడు. సాగర్ లేచేసి నేను కూర్చొంటే ఆయన పూజ చేయకపోవడం కాదు.. ఆయన కూర్చొంటే నేను పూజ చేయను అని సాగర్ లేచేస్తాడు. నేను మీ నాన్నతో మాట్లాడుతున్నా కదా ఉండరా అని వేదవతి అంటే ఏం అవసరం లేదమ్మా.. ఆయనకు బతిమాలుకోవాల్సిన ఖర్మ నాకు లేదు.. నేను పూజలో కూర్చొంటే మీ ఆయన తల మీద కిరీటం కింద పడిపోతుందని అన్నాడు కదా నేను కూర్చొను ఆయన్నే సంతోషంగా పూజ చేసుకోమని చెప్పు అని పక్కకి వెళ్లిపోతాడు.

వేదవతి తల్లి రామరాజుతో అల్లుడు గారు పిల్లలు తప్పు చేస్తే క్షమించాలి కానీ ఈ పంతాలు ఏంటి అని అంటుంది. పోనీలే అని క్షమించడానికి వాడు చేసింది ఏం చిన్న తప్పు కాదండీ.. మోసం.. దొంగ దారిలో ఉద్యోగం సంపాదించుకొని ఆ పాపపు సొమ్ముతో బతకాలి అనుకోవడం కంటే దుస్థితి ఇంకేమైనా ఉంటుందా అని అంటాడు. ఈ విషయం ఇక వదిలేయండి అని వేదవతి ప్రేమ, ధీరజ్‌లను కూర్చొమని అంటుంది. ప్రేమ సంతోషంగా వెళ్లి కూర్చొంటుంది. ధీరజ్ రాకపోవడంతో నీకేమైందిరా అని అడుగుతుంది వేదవతి. తన పక్కన నేను కూర్చొనమ్మా అని ధీరజ్ అంటాడు. ఏంట్రా ఇది.. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నా ఇలా ఎవరికి వారు ఏంట్రా.. నోరు మూసుకొని వెళ్లి తన పక్కన కూర్చొ అని అంటుంది. అమూల్య విషయంలో తను చేసింది నేను తట్టుకోలేకపోతున్నా అందుకే తన పక్కన కూర్చొనని ధీరజ్ అంటాడు.

వేదవతి కొడుకుని పక్కకి తీసుకెళ్తుంది. రేయ్ అమూల్య విషయంలో ప్రేమ చేసింది నువ్వు తట్టుకోలేకపోతున్నావా.. ప్రేమ లేకపోయి ఉంటే.. ప్రేమ తాళి కట్టమని చెప్పకపోయి ఉంటే ఈ రోజు అమూల్య మన కళ్ల ముందు ఉండేది కాదురా.. నీకు ఆ విషయం నీకు అర్థం కాదురా.. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను నీకు చెప్పలేను.. అమూల్య విషయంలో ప్రేమ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు.. స్వార్థం అంతకంటే లేదు.. ఈ అమ్మ మాట నమ్ము ఇంకేం మాట్లాడకుండా పద.. మంచి చేసిన మనిషి కంట నీరు పెట్టించడం కంటే పాపం మరొకటి ఉండదురా అని ధీరజ్‌ని తీసుకెళ్లి ప్రేమ పక్కన కూర్చొపెడుతుంది. రామరాజు, వేదవతి.. ధీరజ్, ప్రేమ జంటలు కల్యాణం జరిపిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.