iBOMMA Release Note On Piracy Content: iBOMMA... ఈ పేరు తెలియని మూవీ లవర్ ఉండరు. అటు థియేటర్‌లో కానీ ఇటు ఓటీటీలో కానీ ఏ కొత్త మూవీ కానీ కంటెంట్ కానీ వచ్చినా అది హై క్వాలిటీ ప్రింట్‌తో ఇందులో ప్రత్యక్షం అవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా, ఓటీటీ పైరసీ కేసుకు సంబంధించి భారీ నెట్వర్క్‌ను ధ్వంసం చేసి ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. థియేటర్స్‌లో రికార్డ్ చేస్తున్న వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు.

పైరసీ కేసు విచారణ క్రమంలో 'iBOMMA' వెబ్ సైట్‌పై దృష్టి సారించిన పోలీసులు దీని కోసం పని చేస్తోన్న నలుగురు నిందితులను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. బిహార్, యూపీ రాష్ట్రాల్లో ఈ వెబ్ సైట్‌కు ఏజెంట్స్ ఉన్నట్లు గుర్తించారు. పైరసీ కంటెంట్ కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో 'iBOMMA' పేరుతో తెలుగులో ఓ ప్రకటన రిలీజ్ కావడం వైరల్ అవుతోంది.

పోలీసులకు సవాల్

సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాన్ని రికవరీ చేసేందుకు ప్రేక్షకులపై రుద్దుతున్నారని... దీని వల్ల సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ మ్యాన్ బాధ పడుతున్నట్లు ప్రకటనలో 'iBOMMA' పేర్కొంది. 'iBOMMA మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. థియేటర్లలో ప్రింట్స్ తీసిన వారి మీద కాకుండా మీ OTT రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాల్లో షూటింగ్, ట్రిప్స్‌కు ఖర్చు చేస్తున్నారు. ప్రొడక్షన్, లైట్ బాయ్స్‌కు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా?.

ఫస్ట్ కెమెరాల సాయంతో థియేటర్లలో మూవీస్ రికార్డు చేసి ఫ్రింట్స్ రిలీజ్ చేసే వెబ్ సైట్ల మీద దృష్టి పెట్టండి. iBOMMA అనేది సిగరెట్ నుంచి E- సిగరెట్‌కు యూజర్స్‌ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుంది. మేం స్వతహాగా వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నాం. వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీకు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం. బురదలో రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాం.' అంటూ 'iBOMMA' పేరుతో ప్రకటన విడుదలైంది.

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారి'తో బ్యూటిఫుల్ 'శశిరేఖ' - 'దసరా' స్పెషల్ సర్ ప్రైజ్ కోసం వెయిటింగ్