ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీల్లో లోపంతో నిత్యం ఎక్కడో ఓచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై నిలిపి ఉంచిన, రన్నింగ్ వాహనాల్లోనూ మంటలు చెలరేగి దగ్ధమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలోనే బ్యాటరీలు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడలోని ఓ ఎలక్ట్రికల్ బైక్ షో బ్యాటరీలు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
హైదర్‌గూడలోని ఎర్రబోడ వద్ద ఉన్న ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా భారీస్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

12 బ్యాటరీలు ఒక్కసారిగా పేలడంతో!
షోరూంలోని దాదాపు 12 బ్యాటరీలు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షోరూంలో ఉన్న పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి.