Hyderabad Crime News: సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలు వాహనదారులు ముఖ్యంగా టూవీలర్స్‌ నడిపే వాళ్లు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఏ మార్గంలో చైనా మాంజా గొంతులు కోస్తుందో, శరీరాన్ని చీల్చేస్తుందో అని భయపడిపోతున్నారు. ఎప్పటి మాదిరిగానే పోలీసులు దుకాణాల్లో తనిఖీలు చేసి, కేసులు పెడతామని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు తగ్గట్టు సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఏకంగా పోలీసులు అధికారే తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాల మీదకు వచ్చింది. ఇప్పటికేనా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

పతంగ్‌లు ఎగరేయడం అదో సరదా. అయితే సరదా అనుకున్న ఈ వేడుక ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు సామాన్యులే గాయపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఏఎస్‌ఐ గొంతు తెగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్ఐ నాగరాజ్ విధుల్లో భాగంగా ఎగ్జిబిషన్ డ్యూటీకి ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరాడు. సుమారు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వెళ్తున్న సమయంలోఆయనకు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఆయన మెడకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ స్వరూప్ నగర్ దగ్గర చైనా మాంజా చుట్టుకుంది. అంటే ఒక్కసారింగా గొంతు కోసుకుపోయి రక్తం ధారగా కారింది. ైక్‌ను పక్కకు ఆపిన పడిపోయిన ఆయన్ని స్థానికులు ఎల్‌బీనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నాగరాజ్‌ పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో డిసెంబర్‌ చివరి నుంచి గాలిపటాల సందడి మొదలవుతుంది. గతంలో ఎత్తైనా భవనాలపై నుంచి గాలి పటాలు ఎగరేస్తూ చనిపోయిన కుర్రాలను, పిల్లల గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రమాదం మరోలా వస్తోంది. ఇది ఎవరూ ఊహించని విధంగా వస్తోంది. కొంత మంది సరదా టూవీలర్స్ పాలిట శాపంగా మారుతోంది. బైక్ తీసి బయటకు వెళ్లాలంటేనే జనం జడుసుకుంటున్నారు. ఎక్కడ చైనా మాంజా అత్కుకొని ఉంటుందో ప్రమాణాలు తీస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోంది.

మొన్నీ మధ్య విద్యుత్ వైర్‌ కూడా ఈ చైనా మాంజా చుట్టుకొని తెగిపోయింది. అంటే ఆ చైనా దారం ఎంత షార్ప్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బైక్‌పై వెళ్తున్న తల్లీ కుమారుడు కూడా ఈ చైనా మాంజా బారిన పడి గాయపడ్డారు. ఇలా పదుల సంఖ్యలో ఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక్క హైదరాబాద్‌కు ఉన్న సమస్యే కాదు. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఎంతగా చర్యలు తీసుకుంటున్నా మాఫియా ఈ దారాలను విక్రయిస్తూనే ఉంది. గుజరాత్ లాంటి ప్రాంతాల్లో పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. బైక్‌కు పొడవాటి తీగలను అమర్చుతున్నారు. వాటికి ఎక్కడైనా చైనా మాంజాలు తగిలితే వెంటనే గుర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని ప్రంతాల్లో మెడ చుట్టూ మఫ్లర్‌లు కట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గట్టిగా ఉంటే క్లాత్‌తో చేసిన బెల్ట్‌లను కూడా ఇస్తున్నారు. వాటిన కట్టుకునే ప్రాణాలకు ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

హైదరాబాద్‌ పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఒకట్రెండు రోజులు దుకాణాల్లో తనిఖీలు చేశారు. అమ్మేవారితోపాటు కొనేవారిపై కేసులు పెడతామని హెచ్చించారు. హెచ్చరించిన స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి. మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేకపోతున్నారు. కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఈ పని చేస్తున్నారు. వారికి మెడ చుట్టూ కట్టుకునేందుకు క్లాత్‌ను ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పోలీసు అధికారే గాయపడి ఆసుపత్రిలో చేరడంతో కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు గాయపడకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.