<p>హైదరాబాద్‌: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్‌ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, ఆపై హత్య చేసి నీటి సంపులో పడేయడం తెలిసిందే.</p>
<p>పాప హత్యపై కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీంచారు. మరోవైపు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాల సాయంతో హత్య చేసింది సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ అని పోలీసులు గుర్తించారు. విల్లా ఆర్కిడ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని విక్రమ్‌ కిడ్నాప్ చేసి, క్లబ్‌హౌస్‌ దగ్గర ఉన్న సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి, ఓ పెద్ద రాయి బాలికకు కట్టి ఆపై నీటి సంపులో పడేశాడు. చిన్నారి చనిపోయిన తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ఏదో విషయం మాట్లాడి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. </p>
<p>బిహార్ కు చెందిన విక్రమ్‌ తీరు నచ్చకపోవడంతో కొన్ని రోజుల కిందటే అతడ్ని పనిలోంచి తీసివేశారు. దాంతో కక్ష పెంచుకున్న అతడు టార్గెట్ చేసి బాలికను కిడ్నాప్ చేశాడు. పాప తండ్రికి ఫోన్ చేసి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు సైతం తండ్రి ఒప్పుకున్నట్లు ఆడియో వైరల్ అయింది. అయితే డబ్బులు తీసుకుని పాపను ఇవ్వకపోతే ఎలా అంటూ కొన్ని విషయాలు నిందితుడితో ఫోన్లో మాట్లాడాడు. కానీ ప్లాన్ ప్రకారం చేసిన కిడ్నాప్, కానీ ఇది డబ్బుల కోసం చేసిన పని కాకపోవడంతో చిన్నారి హత్య చేసినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం మల్కాజిగిరి సీపీ సుమతి ప్రెస్‌మీట్‌ పెట్టి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. </p>