Hyderabad Crime News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన వ్యక్తికి 13 ఏళ్ల బాలిక చుక్కలు చూపించింది. తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడే బయటకు వెళ్దామని వచ్చిన బాలిక ఆ వ్యక్తిని చూసింది. అనుమానం వచ్చి ప్రశ్నించింది. అంతే గుట్టు బయటపడుతుందని ఆమెను నెట్టేసి పరుగెత్తాడు. బాలిక కూడా అతన్ని వెంబడించింది.

భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 12లో ఉమామహేశ్వరి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఉదయం ఇంటికి తాళం వేసి పనికి వెళ్లిపోయింది. పైన ఉన్న ఓనర్‌ కుమార్తె భవాని ఏదో పని మీద బయటకు వెళ్లేందుకు దిగింది. ఇంతలో ఉమా ఇంట్లో తలుపులు కాస్త తెరిచి ఉండటాన్ని గమనించింది. ఆమె పనికి వెళ్లింది కదా ఇంట్లో ఉన్నదెవరో అని ఉమ ఆంటీ అని పిలించింది. లోపలి నుంచి సమాధానం రాలేదు. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసింది. బెడ్‌రూంలో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు.

భవాని రావడాన్ని చూసిన దొంగ కూడా తప్పించుకునేందుకు ఎత్తు వేశాడు. తాను కూడా ఉమా కోసమే వచ్చినట్టు చెప్పాడు. అయితే ఆమె ఇంటికి మీరు ఎప్పుడూ రాలేదని ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. వచ్చిన వాళ్లు బెడ్రూమ్‌లో ఏం చేస్తున్నారని నిలదీసింది. అంతే కాదు. అతని జేబులు, చేతులు చెక్ చేసింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన దొంగ భవానీని తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

దొంగ నెట్టేయడంతో కింద పడిపోయిన భవాని గట్టిగా కేకలు వేసింది. దొంగా... దొంగా... అని అరిచింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు తానే లేచి దొంగ వెంట పరుగెత్తింది. వీధికి సమీపంలో ఉన్న స్కూల్ వద్ద తెలిసిన వాళ్ళు కనిపిస్తే దొంగ వెళ్తున్నాడు పట్టుకోండని అరిచింది. వాళ్లు నువ్వే పట్టుకోపో అని వదిలేశారు. అప్పటికే దొంగ చాలా దూరం వెళ్లిపోయాడు. కనిపించుకుండా పోయాడు.

తిరిగి ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పుడు అప్రమత్తమైన తల్లిదండ్రులు ఉమాకు విషయాన్ని చేరవేశారు. వెంటనే మా భర్త ఇంటికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. మొత్తం చెక్ చేసి వస్తులేవీ పోలేదని తేల్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా భవాని దొంగ వెంట పరుగెత్తుతున్నట్టు రికార్డు అయ్యి ఉంది.

అనుమానం వచ్చిన వెంటనే స్పందించి వస్తువులు చోరీ కాకుండా చూసిన భవానిని స్థానికులు అభినందించారు. సరైన సమయంలో స్పందించినందుకు ఉమా ఫ్యామిలీ కృతజ్ఞత చెప్పారు. ఆమె కేకలకు స్పందించి చుట్టుపక్కల వాళ్లు సరైన టైంలో స్పందించి ఉంటే దొంగను పట్టుకునే వాళ్లమని అంటున్నారు. మొత్తానికి భవాని మంచి సాహసమే చేసిందని అంటున్నారు. భయపడిపోకుండా ధైర్యంగా నిలదీసిందని మెచ్చుకుంటున్నారు.