<p>Lawyer Killed in Attapur | రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. సులేమాన్ నగర్‌లోని తన ఆఫీసులో ఉన్న ఖదీర్ అనే లాయర్‌ను పట్టపగలే కొందరు దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆఫీసు పనిలో బిజీగా ఉన్న ఉన్న సమయంలో అడ్వకేట్ ఖదీర్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసిన దుండగులు, ఆయనను పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖదీర్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు అక్కడి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది.</p>
<p><strong>కుటుంబ వివాదాలే కారణమా ?</strong></p>
<p>లాయర్ ఖదీర్ హత్యపై సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఖదీర్ బావమరుదులే ఈ దారుణం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.</p>