హైదరాబాద్: చారిత్రక నగరం హైదరాబాద్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన బయో-టెర్రర్ కుట్రకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నగరానికి చెందిన డాక్టర్ మొహినుద్దీన్ సహా ముగ్గురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సామూహిక జన సమూహాలను లక్ష్యంగా చేసుకుని, విష ప్రయోగం ద్వారా వారిని చంపి విపత్తు సృష్టించాలని ఈ ముఠా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కుట్రలో ప్రధాన నిందితుడైన డాక్టర్ మొహినుద్దీన్, అమ్జద్, మరో వ్యక్తి కలిసి బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం చేసేందుకు ప్లాన్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన రిసిన్ (Ricin) అనే విష పదార్ధాన్ని ఉపయోగించి సామూహిక హత్యలకు వీరు పాల్పడాలని నిందితులు భావించారు. తొలుత గుజరాత్‌లో భారీ ఎత్తున జరిగే ఉత్సవాలు, బహిరంగ సభలను లక్ష్యంగా చేసుకుని ఈ విష ప్రయోగానికి మొహినుద్దీన్ గ్యాంగ్ ప్రణాళిక సిద్ధం చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఆహారం లేదా నీటి ద్వారా ఈ విషాన్ని ప్రయోగించి భారీగా ప్రాణనష్టం కలిగించడమే నిందితుల ఉద్దేశమని NIA వెల్లడించింది.

ఈ కేసులో పట్టుబడిన డాక్టర్ మొహినుద్దీన్ విదేశాల్లోని ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులతో ఆన్‌లైన్ ద్వారా టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. డార్క్ నెట్, సోషల్ మీడియా వేదికగా విష పదార్ధాల తయారీపై వీరు శిక్షణ పొందినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. గత ఏడాది కాలంగా రహస్యంగా సాగుతున్న ఈ కుట్రను పసిగట్టిన ఎన్‌ఐఏ అధికారులు, నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి పలు డిజిటల్ ఆధారాలను, మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇంకా ఎక్కడెక్కడ బయో టెర్రర్ దాడులకు ప్లాన్ చేశారు, వీరికి ఎవరితో లింక్స్ ఉన్నాయనే కోణంలోనూ ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఏమిటీ రిసిన్ ?
ఆముదపు గింజల నుండి తయారయ్యే అత్యంత ప్రమాదకరమైన పదార్థమే ఈ రిసిన్ విషం. దీనిని పొడి రూపంలో, గాలిలో స్ప్రే రూపంలో లేదా ఆహారంలో కలిపి విషంలా ప్రయోగించవచ్చు. ఇది శరీరంలోకి ప్రవేశించిన కొన్ని గంటల్లోనే నాణీకణాలు, రక్త కణాల పనితీరును దెబ్బతీసి ప్రాణాలు తీస్తుంది. ఇప్పటివరకూ దీనికి విరుగుడు (Antidote) కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది. అందుకే నిందితులు ఈ మార్గంలో బయో టెర్రర్ దాడులకు సిద్ధమయ్యారు.