హైదరాబాద్: ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని సంబరపడుతుంటారు. అయితే చాలా కాలం తర్వాత ఆడపిల్ల పుట్టడంతో ఆ కుటుంబం ఎంతో సంబరపడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ పసిపాప ఇప్పుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల కింద భూమి కదిలినట్లు అనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ఒక మెడికల్ హాస్పిటల్‌లో 14 నెలల చిన్నారి మృతి కలకలం రేపుతోంది.

మేడ్చల్ జిల్లా పరిధిలోని బాచుపల్లి మమతా మెడికల్ హాస్పిటల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కింద పడి తలకి దెబ్బతగలడంతో 14 నెలల పసిపాపను తల్లిదండ్రులు నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మెరుగైన చికిత్స కోసం ఈ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నారికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఉదయం 4:00 గంటల సమయంలో పాప ఆరోగ్యం బాగుందన్నారు. చిన్నారికి ఏం ప్రమాదం లేదని కుటుంబ సభ్యులకు డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. ఉదయం 7:00 గంటల సమయానికి కూడా పాప సాధారణ స్థితిలోనే ఉందని తల్లిదండ్రులు తెలిపారు.

డాక్టర్ల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆరోపణలు

అయితే ఉదయం 9 గంటల సమయంలో ఆసుపత్రిలో వెంటిలేటర్ సరిగ్గా పనిచేయకపోవడంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందంటూ డాక్టర్లు హడావిడి చేయడం ప్రారంభించారు. వెంటిలేటర్ మోనిటర్‌పై హార్ట్ బీట్ లైన్ సరళరేఖ (స్ట్రెయిట్‌)గా మారి పాప ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ, డాక్టర్లు సీపీఆర్ చేస్తున్నట్లు నాటకమాడారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లనే తమ పాప చనిపోయిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో కాలం నిరీక్షించిన తర్వాత పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.