Air Pollution in Hyderabad | హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం స్లో పాయిజన్‌లా మారి మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి నగరాల్లో గాలి నాణ్యత క్షీణిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జాతీయ స్వచ్ఛ వాయు (NCAP) కార్యక్రమం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతాల్లో వాహనాల పొగ, పరిశ్రమల వ్యర్థాలు, రోడ్లపై లేచే దుమ్ము, ధూళి, నిరంతర నిర్మాణ కార్యకలాపాల వల్ల ఆరోగ్యకరమైన గాలి వీచడం కష్టంగా మారింది.

2025-26 వార్షిక సగటు గణాంకాల ప్రకారం, సూక్ష్మ ధూళి కణాలైన పీఎం-10 (PM-10) స్థాయిలు జాతీయ ప్రమాణాలను మించి నమోదవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. హైదరాబాద్‌లో జాతీయ పరిమితి కంటే 33.3 శాతం అధికంగా కాలుష్యం నమోదు కాగా, సంగారెడ్డిలో 30 శాతం, నల్గొండలో 18.3 శాతం మేర అధికంగా నమోదవుతోంది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిబంధనల ప్రకారం, గాలిలో పీఎం-10 వార్షిక సగటు క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాములకు మించరాదని నిపుణులు చెబుతున్నారు. అయితే 2025-26 లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ఈ స్థాయి 80 మైక్రోగ్రాములు ఉండగా, సంగారెడ్డిలో 78 మైక్రోగ్రాములు, నల్గొండలో 71 మైక్రోగ్రాములుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పీఎం-10 వార్షిక సగటు కేవలం 15 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. కానీ హైదరాబాద్‌లో డబ్ల్యూహెచ్‌ఓ పరిమితి కంటే 5.3 రెట్లు ఎక్కువగా ఉండగా, సంగారెడ్డిలో 5.2 రెట్లు, నల్గొండలో 4.7 రెట్లు అధికంగా ప్రమాదకర స్థాయిల్లో కాలుష్యం ఉంది.

ఈ సూక్ష్మ ధూళి కణాలు శ్వాస వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి మీ ఊపిరితిత్తులతో పాటు రక్తప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో ప్రారంభించిన ‘జాతీయ స్వచ్ఛ వాయు’ కార్యక్రమం వల్ల హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత పోలిస్తే కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ సాధారణ స్థాయిల కంటే 33.3 శాతం ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలం ఈ కాలుష్య గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిపై వాయు కాలుష్యం ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.