<p>Kethireddy Pedda Reddy News | తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైలైట్‌గా నిలిచే ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. నేడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేశారు. ఈ నిరసనకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో, పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. </p>
<p>పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. దీంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో అనంతపురానికి తరలించారు. పెద్దారెడ్డి అరెస్ట్‌తో తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణవ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/P_RHYwuS_W8?si=mWa7MJCILZXP2m4d" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరిగాయి. ఒకే రోజు అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు వైఎస్సార్‌సీపీ నిరసనను అడ్డుకున్నారు.</p>