Healthy Diet Reduce the Risk of High Cholesterol : కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ లేదా ఇతర జీవక్రియ సంబంధిత వ్యాధులు ఉంటే.. మీకు కూడా కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని అర్థం కాదట. ఎందుకంటే ఇండియాలో జరిపిన ఓ కొత్త అధ్యయనంలో.. కొన్ని జన్యు వైవిధ్యాలు ఉన్న వ్యక్తులు.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకున్నవారిలో ఈ జన్యుపరమైన ప్రమాదాల ప్రభావాలను తగ్గినట్లు గుర్తించారు.

ఈ అధ్యయనాన్ని చెన్నైలోని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF), యూకేలోని రీడింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సామూహికంగా నిర్వహించారు. భారతదేశంలో మధుమేహం, డిస్లిపిడెమియా (రక్తంలో అధిక కొవ్వు స్థాయిలు).. గుండె జబ్బులు ప్రమాదం పెంచుతున్న సమయంలో ఈ అధ్యయనం కాస్త ఉపశమనం ఇచ్చింది. తీసుకునే ఆహారంలో రిఫైండ్ కార్బోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర, ఉప్పు పరిమాణం పెరగడం.. పండ్లు, కూరగాయలు, ఇతర పోషకమైన ఆహారాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు.

Also Read : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి

9 మంది భారతీయులలో 8 మందికి డిస్లిపిడెమియా

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) కొన్ని నెలల క్రితం ఇండియాబ్ సిరీస్ కింద ఒక పెద్ద జాతీయ అధ్యయనం నిర్వహించింది. దీనిలో భారతదేశంలోని వయోజనులలో సుమారు 87.3 శాతం మందికి డిస్లిపిడెమియా ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితి గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

దేశంలో సుమారు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా.. దాదాపు 136 మిలియన్ల మంది ప్రీడయాబెటిస్‌తో, 356 మిలియన్ల మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) గత సంవత్సరం చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. భారతీయులు తమ ఆహారంలో రోజువారీ కేలరీలలో 62.3 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి తీసుకుంటున్నారట. ఇందులో అధిక భాగం తక్కువ నాణ్యత గలవేనని గుర్తించారు.

Also Read : సైలెంట్‌గా పెరుగుతున్న కొలెస్ట్రాల్.. ఈ లక్షణాలు పెరుగుతోన్న కొవ్వుకు సంకేతం, నెగ్లెక్ట్ చేయకండి

పరిశోధన ఎలా జరిగిందంటే..

ఈ కొత్త అధ్యయనంలో భాగంగా 25 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల 1,020 మందిపై పరిశోధన చేశారు. వీరిలో 452 మంది పురుషులు, 568 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ చెన్నై పట్టణ గ్రామీణ ఎపిడెమియాలజీ అధ్యయనంలో పాల్గొన్నవారే. గతంలో మధుమేహం, జీవక్రియ సమస్యలతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన TCF7L2, FTO అనే రెండు జన్యువులలోని మూడు జన్యు వైవిధ్యాలపై దృష్టి సారించారు.

మెయిన్ హీరో హెల్తీ ఫుడ్ మాత్రమే..

ఈ పరిశోధనలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సరైన ఆహారం తీసుకోని వారిలో.. జన్యుపరమైన ప్రమాదం ఉన్నవారితో పోలిస్తే.. అధిక జన్యుపరమైన ప్రమాదం ఉన్నవారికి మొత్తం కొలెస్ట్రాల్, LDL (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మితమైన లేదా మంచి నాణ్యమైన ఆహారం తీసుకునేవారిలో ఈ వ్యత్యాసం కనిపించలేదు. దీని అర్థం ఏమిటంటే.. అధిక కొలెస్ట్రాల్‌కు జన్యుపరమైన ప్రమాదం ఉన్నవారు కూడా.. మెరుగైన ఆహారం తీసుకుంటే సమస్యను దూరం చేసుకోవచ్చు.

Also Read : గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ

పరిశోధకుల ప్రకారం.. ఆహారానికి, జన్యువులకు మధ్య ఉన్న ఈ సంబంధం మొత్తం కొలెస్ట్రాల్, LDL విషయంలో గణాంకపరంగా గణనీయమైనదిగా తేలింది. అధిక జన్యుపరమైన ప్రమాదం, ఉపవాస రక్త గ్లూకోజ్, HbA1c అధిక స్థాయిలతో కూడా ముడిపడి ఉందని తెలిపారు.

ఆహారం ప్రభావం ఎంతవరకు ఉంటుంది?

మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ఈ అధ్యయన సహ రచయిత అయిన డాక్టర్ వి. మోహన్ మాట్లాడుతూ.. మన జన్యువులు మన జీవక్రియ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్ధారించవని అన్నారు. కేవలం జన్యుపరమైన ప్రమాదం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయని అర్థం కాదని ఆయన తెలిపారు.

రీడింగ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్త అయిన కె. ఎస్. విమలేశ్వరన్ మాట్లాడుతూ.. ప్రజలు తమ జన్యువులను మార్చుకోలేకపోయినప్పటికీ.. తమ ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాలని సూచించారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలను చేర్చుకోవాలని అన్నారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అదనపు స్వీట్స్, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులను తగ్గించుకోవాలని సూచించారు.

Also Read : కళ్లు, గోళ్లలోని ఈ మార్పులు అధిక కొలెస్ట్రాల్కు సంకేతాలు.. ప్రమాదమంటోన్న నిపుణులు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.