'లవ్ టుడే'తో తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మారారు. ఆ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. 'లవ్ టుడే' తర్వాత 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' (తమిళంలో 'డ్రాగన్') చేశారు. ఆ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.‌ తనకు కూడా యాక్టింగ్ చేయాలని ఉందనే హింట్ అక్కడ ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే... కెమెరా ముందుకు రావడానికి ధైర్యం కావాలని చెప్పిన ఆయన ఆ ఈవెంట్ జరిగిన మూడు రోజుల్లో కెమెరా ముందుకు వచ్చారు.

'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' వేడుకలో హరీష్ ఏం చెప్పారంటే?
''కెమెరా వెనుక ఉన్న దర్శకులు కెమెరా ముందుకు రావాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు‌. నా సినిమాలు కొన్ని డిలే అవుతున్న సమయంలో హీరోగా చేద్దామని అనిపిస్తుంది. అయితే నాకు అంత ధైర్యం లేదు. అంత కన్విక్షన్ లేదు. ఈ విషయంలో ప్రదీప్ రంగనాథన్ ధైర్యంగా ముందడుగు వేశాడు. అతడికి హాట్సాఫ్'' అని హరీష్ శంకర్ చెప్పారు. ఇప్పుడు ఆయనకు కూడా ఆడియన్స్ హాట్సాఫ్ చెప్పే టైం వచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు అంటే... హరీష్ శంకర్ కూడా కెమెరా ముందుకు వచ్చారు ఆయన కూడా నటుడిగా మారారు.

'ఓ భామ అయ్యో రామ' సినిమాలో హరీష్ శంకర్!
సుహాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాలలో 'ఓ భామ అయ్యో రామ' (O Bhama Ayyo Rama Movie) ఒకటి. రామ్ గోధల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను వి ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ గడగోని, ప్రదీప్ తల్లపురెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఈ సినిమాలో హరీష్‌ శంకర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 'ఓ భామ అయ్యో రామ' షూటింగ్ జరుగుతోంది. బుధవారం జరిగిన చిత్రీకరణలో హరీష్ శంకర్ జాయిన్ అయ్యారు. ఆయన మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు రామ్ గోధల. హరీష్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సినిమాలో ఆయన ఎంతసేపు కనిపిస్తారు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఆయన నటుడిగా మారారు అనేది కన్ఫర్మ్. ఇంతకు ముందు 'నిప్పు', 'నేనింతే' సినిమాలలో హరీష్ శంకర్ అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కాస్త వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు.

Also Read: రకుల్ పెళ్లిలో ఫోనుల్లేవ్... ఆ కండిషన్ ఎందుకో చెప్పిన స్టార్ హీరోయిన్

'ఓ భామ అయ్యో రామ' సినిమాతో మలయాళ భామ మాళవిక మనోజ్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతుంది. ఈ సినిమాను రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. హరీష్ శంకర్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: రాజమౌళికి లైన్ వేసిన యాంకర్ రష్మీ... ఐ లవ్యూ కూడా చెప్పేసింది - వైరల్ వీడియో చూడండి