హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ (TGSRTC) టికెట్ ఛార్జీలు పెంచి మరింత ఇబ్బంది పెడుతోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ పూట ఆర్టీసీ టికెట్‌ ధరలను విపరీతంగా పెంచి ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. నిత్యం నడిచే రెగ్యులర్‌ బస్సుల సంఖ్యను తగ్గించి, పండుగ స్పెషల్‌ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టడం అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్‌ చేశారు. ఒక చేత్తో ఉచిత ప్రయాణం అంటూనే.. మరో చేత్తో డబుల్ దోపిడీ చేస్తున్నారు. ఇదేనా మీ ప్రజాపాలన? అని హరీష్ రావు ప్రశ్నించారు.

రూ.230.. పండుగ సందర్భంగా ఏకంగా రూ.400కు

ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. జేబీఎస్‌ (JBS) నుంచి కరీంనగర్‌కు సాధారణ టికెట్‌ ధర రూ.230 ఉండేది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ఏకంగా రూ.400కు పెంచేశారని హరీష్ రావు ఆరోపించారు. అలాగే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220 ఉన్న చార్జీని సైతం పండుగపూట రూ.290కి పైగా వసూలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రూట్లలోనూ టికెట్‌ ఛార్జీలను దాదాపు రెట్టింపు చేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, కరువు పరిస్థితుల్లోనూ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

పండుగలు వస్తే చాలు.. ఇష్టం ఉన్నట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా @revanth_anumula ? బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం. జెబిఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO

— Harish Rao Thanneeru (@BRSHarish) October 18, 2026

బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను రెట్టింపు చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. భార్యకు ఫ్రీ టికెట్ అయితే.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, ఏం రాయితీ ఇచ్చినట్టు ? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబం భరిస్తున్నట్లే అన్నారు. రోజూ నడిచే బస్సులకే ‘పండుగ స్పెషల్’ అని బోర్డులు తగిలించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.

ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను (RTC Ticket Charges) 5 సార్లు పెంచారని, ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రభుత్వంపై విమర్వలు గుప్పించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించడంతో పాటు రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.