Happy Fathers Day 2026 Wishes : తల్లి ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ కుటుంబం కోసం జీవితాంతం కష్టపడుతూ.. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు తండ్రి. కానీ కొన్ని కారణాల వల్ల నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఆయన ప్రేమకు తగిన గౌరవం ఇవ్వాలని.. కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతోన్న ఆయన త్యాగాలను గుర్తించాలనే ఉద్దేశంతో ఫాదర్స్ డే జరుపుతున్నారు. ఈ ఫాదర్స్ డే రోజు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి.. నాన్నకు ఎలా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాదర్స్ డే చరిత్ర

ఫాదర్స్ డే అనేది అమెరికాలో మొదలైంది. 1909లో అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి గౌరవార్థం ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని భావించింది. ఆమె తండ్రి ఒంటరిగా ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశాడని.. ఆయనకు చేసిన త్యాగాలకు ఏదైనా చేయాలని భావించింది. దీంతో ఆమె చేసిన ప్రయత్నాల ఫలితంగా 1910 జూన్ 19న మొదటిసారిగా ఫాదర్స్ డే జరుపుకున్నారు. అనంతరం ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం అనేక దేశాల్లో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డేను నిర్వహిస్తున్నారు.

ఫాదర్స్ డే ప్రాముఖ్యత

తండ్రి కుటుంబానికి వెన్నెముక లాంటివాడు. పిల్లలకు క్రమశిక్షణ, విలువలు, బాధ్యతలను నేర్పడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఫాదర్స్ డే అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. తండ్రి చేసిన త్యాగాలు, ప్రేమ, కష్టాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేక రోజుగా భావిస్తారు.

ఈ స్పెషల్ డే రోజు తండ్రిపట్ల ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయన శుభాకాంక్షలు చెప్పవచ్చు. అలాగే ఆయన కుటుంబం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలనుకుంటే ఇవి మీకోసమే..

ఫాదర్స్ డే శుభాకాంక్షలు 2026

నా మొదటి హీరో నువ్వే నాన్న. జీవితంలో ప్రతి అడుగులో అండగా నిలిచిన వ్యక్తి మీరు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

మీ ప్రేమ, మీ కష్టం, మీ త్యాగాలు నా జీవితానికి బలమైన పునాది. ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న.

ప్రపంచంలోనే గొప్ప గురువు, నిజమైన స్నేహితుడు, ఉత్తమ తండ్రి మీరే నాన్న. ఈ విషయం నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

నా విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి మీరే. నా ఆశయం కోసం మౌనంగా మీరు చాలా కష్టపడ్డారు. మీకు హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న.

నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం నేర్పిన మీకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరే నా ఇన్స్ప్రేషన్.

నేను నాన్నగా మారేవరకు తెలియలేదు నాన్న.. మీరు మాకోసం ఎన్ని త్యాగాలు చేశారో. సారీ నాన్న ఈ విషయం తెలుసుకోవడానికి చాలా ఆలస్యమైంది. హ్యాపీ ఫాదర్స్ డే.

నీతో మాట్లాడాలంటే భయం నాన్న.. కానీ ప్రేమ లేదు అనుకోకు. మా అభివృద్ధి కోసమే నువ్వు కఠినంగా మారిపోయావు అని అర్థమైంది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

ఇలా మీ భావాలనే శుభాకాంక్షలుగా వ్యక్తపరచవచ్చు. లేదా మీ నాన్నతో మీకున్న ఫోటోను.. లేదా మీ నాన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. క్యాప్షన్స్ పెట్టవచ్చు. మీ నాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దానితో పాటు లెటర్ రాసి ఇవ్వొచ్చు. ఫాదర్స్ డే అనేది ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడానికి మాత్రమే కాదు కాబట్టి.. ఆయన మీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారనే దానిపై ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు వాటిని గుర్తించి ఆయనకో హగ్ ఇస్తే చాలు. అదే మీరు ఆయనకు ఇచ్చే అమూల్యమైన బహుమతి.