Gas Cylinder Safety Tips : ఒకప్పుడు వంట చేసేందుకు మట్టి పొయ్యిలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో వంట చేయడానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్ అనేది ఒక సాధారణ అవసరంగా మారిపోయింది. అయితే అదే అవసరం కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతుంది. చాలాసార్లు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం లేదా పైపులు పాడైపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.

చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తరచుగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతుంది. అందుకే గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. కొంచెం జాగ్రత్త తీసుకుంటే.. మీరు మీ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుంచి రక్షించవచ్చని చెప్తున్నారు. మరీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో చూసేద్దాం.

సబ్బు నీటితో చెక్ చేయండి..

గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే ముందు.. దాని సీల్, వాల్వ్‌ను తనిఖీ చేయండి. గ్యాస్ లీక్ అయినట్లు కొంచెం వాసన వచ్చినా వెంటనే రెగ్యులేటర్‌ను ఆపేసి.. అన్ని కిటికీలను తెరవండి. గ్యాస్ లీక్‌ను తనిఖీ చేయడానికి మ్యాచ్ లేదా లైటర్‌ను ఉపయోగించవద్దు. బదులుగా సబ్బు నీటిని పైపులపై వేసి చూడండి.మీరు నీరు పోసినప్పుడు బుడగలు వస్తున్నాయంటే గ్యాస్ లీక్ అవుతున్నట్లు అర్థం. వెంటనే మీరు ప్రమాదాన్ని నివారించడానికి ఇతరుల హెల్ప్ తీసుకోవచ్చు.

గడవు తేదీ చూస్తున్నారా?

గ్యాస్ పైపుల గడువు తేదీని కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి అంటున్నారు. రెగ్యులేటర్, నాబ్‌లను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. తద్వారా ధూళి లేదా నూనె మార్క్స్ గ్యాస్ ప్రవాహంలో అంతరాయం కలగకుండా ఉంటాయి. ప్రమాదాలు తగ్గుతాయి.

గ్యాస్ లీక్ అవుతుంటే ఇవి ఫాలో అవ్వండి

ఏదైనా కారణం చేత సిలిండర్‌లో గ్యాస్ లీక్ అవుతున్న భయపడవద్దు. వెంటనే గ్యాస్ ఆపివేయండి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దు. ఫ్యాన్, లైట్ లేదా మొబైల్ ఛార్జర్లను కూడా ఆన్ చేయకూడదు. ఎందుకంటే స్పార్క్ వలన మంటలు చెలరేగే అవకాశం ఉంది. అన్ని తలుపులు, కిటికీలను తెరిచి వెంటిలేషన్ వచ్చేలా చూడాలి.

గుర్తించుకోవాల్సిన విషయాలు

వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద నూనె పడకుండా లేదా పాన్ పొంగిపోకుండా చూసుకోండి. ఎందుకంటే దీనివల్ల కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంది. సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిటారుగా ఉంచాలి. ఎండ లేదా వేడి వచ్చే ప్రదేశాల్లో సిలిండర్లు ఉంచకూడదు. సిలిండర్‌లో ఏదైనా సమస్య ఉంటే.. మీరే ఏదైనా చేయడానికి బదులుగా వెంటనే గ్యాస్ ఏజెన్సీ లేదా అగ్నిమాపక దళానికి కాల్ చేయండి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే అతిపెద్ద భద్రత అని గుర్తించుకోవాలి.