<p>Indigo Flight Takeoff at Gannavaram Airport | గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (Indigo Flight)లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని రన్‌వేపైనే అత్యవసరంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.</p>
<p><strong>విమానంలో ప్రముఖులు - ప్రయాణికుల ఆందోళన</strong><br />ఈ విమానంలో సుమారు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయ్యే విమానం ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న వారిలో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఇండిగో అధికారులు ఆ విమాన సర్వీసును తక్షణం రద్దు చేశారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేస్తామని ఇండిగో అధికారులు తెలిపారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు. </p>