Sri Rama Navami Celebrations | నందిగామ: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసిన పలువురు గ్రామస్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. బాధితులను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని గ్రామ కమిటీ శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తుల కోసం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసింది. అయితే, రాత్రి ఇక్కడ భోజనం చేసిన వారు, టిఫిన్లు తిన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజన్ కు ఖచ్చితమైన కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనతో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్‌‌కు కారణమైన వంట సరుకుల శాంపిల్స్ ను అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపనున్నారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. శ్రీరామనవమి వేడుకల్లో అన్నదానం ఫుడ్ పాయిజన్‌కు దారితీయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.