<p>తిరుపతి: డాకు మహారాజ్ మూవీ రిలీజ్ సందర్భంగా గొర్రె పొట్టేలును బలిచ్చిన బాలకృష్ణ అభిమానులపై కేసు నమోదైంది. పెటా ఇండియా ఫిర్యాదుతో తిరుపతి పోలీసులు ఈ ఘటనలో బాలకృష్ణ ఫ్యాన్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ గొర్రె పొట్టేలును బలివ్వడం వివాదానికి కారణమైంది.</p>
<p>తిరుపతిలోని టాటా నగర్‌లోని ప్రతాప్ థియేటర్ కాంపౌండ్ లో బాలకృష్ణ అభిమానులు ఓ గొర్రె పొట్టేలను బలిచ్చారు. చుట్టూ ఎంతో మంది జనం గుమిగూడి గట్టిగా కేకలు వేస్తూ ఓ పొట్టేలను బలిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పొట్టేలు తల నరికి బలిచ్చిన వెంటనే రక్తం అద్దుకుని, డాకు మహారాజ్ సినిమా కటౌట్ కు రుద్దడం ఆ వీడియోలో కనిపించింది. </p>
<p>భారతీయ న్యాయ సంహిత, 2023లోని 3(5) 325 & 270 సెక్షన్ల కింద ఐదుగురు వ్యక్తులపై FIR నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ జంతువులు. పక్షుల బలి (నిషేధం) చట్టం, 1950 లోని సెక్షన్లు 4 & 5, 6 & 8 సెక్షన్లు నమోదు చేశారు. వాటితో పాటు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం 1960 లోని సెక్షన్లు 3, 11(1)(a), 11(1)(l) లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. </p>