Wedding Night Heist: ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకుని సమాజంలో గొప్ప హోదా దక్కించుకోవాలనుకున్న ఒక వరుడి కల.. చివరకు కోటి రూపాయల పీడకల గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పెళ్లయిన కొన్ని గంటలకే నగలు, నగదుతో నవవధువు మాయమైన ఈ విచిత్ర క్రైమ్ స్టోరీ స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తాను IAS అధికారిణిని అంటూ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌తో అమాయక కుటుంబాన్ని ముగ్గులోకి దించి, చివరకు కోటి రూపాయల ఆస్తులతో ఉడాయించిన సాధన అనే మాయలాడిని బరేలీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

బదౌన్‌ పట్టణానికికు చెందిన సాధన అనే మహిళ సోషల్ మీడియాలో తాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించింది. సివిల్ సర్వెంట్స్ పట్ల సమాజంలో ఉండే విపరీతమైన గౌరవాన్ని పెట్టుబడిగా మలచుకుని, పెద్ద పెద్ద కుటుంబాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బరేలీ ఫరీద్‌పూర్ పరిధిలోని పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ఆమె వలలో పడ్డాడు. పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టింది. తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో వరుడి కుటుంబ సభ్యులు ఎగిరి గంతేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఘనంగా ముగిసింది.

అసలు ట్విస్ట్ పెళ్లయిన రోజే శోభనం సందర్భంగా జరిగింది. పెళ్లి ముగిసి అత్తవారింట్లో అడుగుపెట్టిన నకిలీ ఐఏఎస్ కోడలికి.. వరుడి తరపు బంధువులు సంప్రదాయం ప్రకారం కోట్ల విలువైన బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలను బహుమతులుగా సమర్పించారు. ఆ రాత్రి భర్త అభిషేక్ శోభనం గదిలో అలసటతో గాఢ నిద్రలోకి జారుకోగానే, సాధన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇంట్లో ఉన్న నగదు, బంధువులు ఇచ్చిన విలువైన కోటి రూపాయల నగలతో సహా అర్ధరాత్రి ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచావకుండా ఇల్లు దాటి పారిపోయింది.

ఉదయం లేచి చూసేసరికి భార్యతో పాటు కోటి రూపాయల విలువైన నగలు మాయమవ్వడంతో షాక్‌కు గురైన అభిషేక్ కుటుంబం తలబాదుకుంది. మోసపోయామని గ్రహించి తక్షణమే పోలీసులను ఆశ్రయించింది. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బరేలీ పోలీసులు సాధనతో పాటు ఆమెకు సహకరించిన తండ్రి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై చీటింగ్, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేశారు. ఈ కిలేడీని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు ఎట్టకేలకు సాధనను పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించాయి.

నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్‌ను విశ్లేషిస్తున్న పోలీసులు.. ఈమె గతంలో కూడా ఇదే తరహా మ్యారేజ్ ఫ్రాడ్' నెట్‌వర్క్ ద్వారా ఎంతమందిని ముంచిందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. హోదా చూసి మురిసిపోయి, బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎంతటి ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయో చెప్పడానికి ఈ నకిలీ ఐఏఎస్ పెళ్లి పేరడీయే ఒక పెద్ద ఉదాహరణ.