Electric Vehicles AVAS Sound Rule: మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు, మన పక్క నుంచి నిశ్శబ్దంగా ఒక వాహనం వెళ్లిపోతుంది. అది ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (EV) కాబట్టి సౌండ్‌ చేయదు, ఆ బండి మనల్ని దాటిన తర్వాతే మనకు తెలుస్తుంది. అంటే, ఏదైనా EV మన కళ్లకు కనిపిస్తుంది తప్ప, మన చెవులకు వినిపించదు. ఇది, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించినప్పటికీ, ప్రజలకు సురక్షితం మాత్రం కాదు. దీంతో, రోడ్డుపై తిరిగే ఎలక్ట్రిక్ వాహనాలను సురక్షితంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. 2026 అక్టోబర్ 1 నుంచి (ఏడాది తర్వాత) లాంచ్‌ అయ్యే అన్ని కొత్త EV మోడళ్లలో AVAS వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ 'కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ' (MoRTH) ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అమ్మకానికి ఉన్న అన్ని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & వాణిజ్య వాహనాలను 2027 అక్టోబర్ 1 నాటికి ఈ సాంకేతికతతో నవీకరించాల్సి ఉంటుంది.

AVAS వ్యవస్థ ఎందుకు అవసరం?
ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్ & డీజిల్ వాహనాల కంటే చాలా నిశ్శబ్దంగా నడుస్తాయి. పాదచారులు & ద్విచక్ర వాహనదారులకు ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS) ఈ వాహనాలను సురక్షితంగా చేస్తుంది. ఈ వ్యవస్థను EVలో ఏర్పాటు చేసిన తర్వాత, ఆ వాహనం గంటకు 20 కి.మీ. కంటే తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు ధ్వనిని విడుదల చేస్తుంది, వాహనం ముందు లేదా వెనుక ఉన్న వ్యక్తులను ఈ ధ్వని హెచ్చరిస్తుంది.

ఏ వాహనాలకు AVAS?
MoRTH ప్రతిపాదన ప్రకారం, ఈ నియమం M & N కేటగిరీ ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు, వ్యాన్లు & బస్సులు వంటి ప్రయాణీకుల వాహనాలు, అలాగే ఎలక్ట్రిక్ సరుకు రవాణా వాహనాలు & ట్రక్కులు ఈ కేటగిరీల్లోకి వస్తాయి. దీని అర్థం... భవిష్యత్తులో, అన్ని పెద్ద EVలు AVAS వ్యవస్థలతో వస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు & ఇ-రిక్షాలను ప్రస్తుతానికి ఈ వర్గం నుంచి మినహాయించారు.

AVAS ఎలా పని చేస్తుంది?
వాహనాలు గంటకు 20 కి.మీ. కంటే తక్కువ వేగంతో లేదా రివర్స్ గేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సాంకేతికత శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాహనం వేగాన్ని పెంచుతున్నప్పుడు, ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా స్విచ్ఛాఫ్‌ అవుతుంది. ఎందుకంటే, EV అధిక వేగంలో ఉన్న టైర్ల రాపిడి & గాలి ఒత్తిడి శబ్దాన్ని సృష్టిస్తాయి.

ప్రపంచ అనుభవాలు ఏం చెబుతున్నాయి?
US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ నివేదిక ప్రకారం, పెట్రోల్ & డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ కార్లు పాదచారులకు 20% ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి & తక్కువ వేగంతో ఈ ప్రమాదం 50% వరకు పెరుగుతుంది. అందుకే US, జపాన్ & యూరప్‌లో AVAS ఇప్పటికే తప్పనిసరిగా మారింది. ఇప్పుడు, భారతదేశం కూడా ఈ దిశలో కదులుతోంది.

ఏ వాహనాలకు ఇప్పటికే AVAS ఉంది?
భారతదేశంలోని కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే AVAS వ్యవస్థలతో నడుస్తున్నాయి. MG Comet, Tata Curvv EV, Hyundai Creta Electric, Mahindra XEV 9e & Mahindra BE 6 వంటి మోడళ్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ వాహనాల్లోని ఈ సాంకేతికత పాదచారులు & ద్విచక్ర వాహనదారుల భద్రతను పెంచుతుంది.