EV offer for Telangana government employees:  పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా వాహన తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక రాయితీలను ఖరారు చేసింది. సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), మహీంద్రా, ఏథర్ ఎనర్జీ వంటి ప్రముఖ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20 శాతం వరకు అదనపు డిస్కౌంట్ ఇచ్చేందుకు అంగీకరించాయి.

దేశంలోనే తొలిసారిగా స్టేట్ నెగోషియేటెడ్ రాయితీలు

సాధారణంగా ప్రభుత్వం పన్ను మినహాయింపులు మాత్రమే ఇస్తుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి తయారీ సంస్థలతో నేరుగా చర్చలు జరిపి తన ఉద్యోగుల కోసం ప్రత్యేక ధరలను నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి. ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ఇచ్చే ఈ ప్రత్యేక ఆఫర్ల వల్ల ఒక్కో ఉద్యోగి వాహనాన్ని బట్టి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం పన్ను రాయితీలు మాత్రమే కాకుండా, నేరుగా కొనుగోలు ధరలోనే ఈ తగ్గింపు లభిస్తోంది.

100% పన్ను మినహాయింపుతో రెట్టింపు లాభం

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈవీ పాలసీ-2024 ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్‌పై 100 శాతం మినహాయింపు అమలులో ఉంది. ఇప్పుడు అదనంగా లభించే ఈ 20 శాతం డిస్కౌంట్‌తో కలిపి చూస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అత్యంత చౌకగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఇకపై ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే లేదా అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Grateful to @bhash
Your support is helping shape a greener and stronger Telangana.
Applause to Ola Electric for enabling government employees to embrace EVs with special offers. This initiative will accelerate change where it matters most at the grassroots.

Telangana is setting… pic.twitter.com/0FzFUuuOFy

— Ponnam Prabhakar (@Ponnam_INC) March 24, 2026

గ్రీన్ తెలంగాణ దిశగా అడుగులు

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులే ముందుగా ఈవీలను వినియోగించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. దీని కోసం సచివాలయం, జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో భారీగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలపడం వల్ల క్షేత్రస్థాయిలో పెను మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.