EPFO 3.0 Update: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో EPFO 3.0 గురించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. డిజిటలైజేషన్ వైపు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund), పెన్షన్ సేవలను వేగవంతంగా, పేపర్‌లెస్ గా మార్చడమే లక్ష్యంగా ఈ మార్పును చేపట్టింది.

లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. పీఎఫ్ పనులను సులభతరం చేయడానికి, కాగితపు ప్రక్రియలను తగ్గించడానికి EPFO 3.0 రూపొందించింది. దీని ద్వారా సభ్యులు ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా తమ పీఎఫ్ అకౌంట్లను నిర్వహించుకోవచ్చని తెలిపారు. పేపర్ డాక్యుమెంట్ అవసరాన్ని తగ్గించడం, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, కంపెనీ యజమానులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనిని 5 పాయింట్లలో మీరు తెలుసుకోండి.

5 లక్షల వరకు ఆటో-సెటిల్‌మెంట్: త్వరలో 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఆటోమేటిక్‌గా సెటిల్ అవుతాయి. సాఫ్ట్‌వేర్ స్వయంగా మీ డేటాను తనిఖీ చేస్తుంది. డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. గతంలో ఈ పరిమితి కేవలం 1 లక్ష వరకు మాత్రమే ఉండేది.

డబ్బు అందడంలో తక్కువ సమయం: గతంలో పీఎఫ్ డబ్బు రావడానికి 7 నుంచి 15 రోజుల సమయం పట్టేది. కొన్నిసార్లు నెల రోజులకు పైగా పట్టేది. కానీ కొత్త సిస్టమ్‌తో క్లెయిమ్ చేసిన 3-4 రోజుల్లోనే మనీ మీ ఖాతాలోకి వస్తుంది.

కాగితపు విధానానికి స్వస్తి: గతంలో క్లెయిమ్ ఫారమ్‌తో పాటు చెక్కు ఫోటో లేదా బ్యాంక్ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. EPFO 3.0తో మీ KYC (ఆధార్, పాన్, బ్యాంక్) అప్‌డేట్ అయి ఉంటే, సిస్టమ్ స్వయంగా వెరిఫై చేసుకుంటుంది.

తక్కువ రిజెక్షన్లు: గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు చాలా వరకు రిజెక్ట్ అయ్యేవి. కానీ EPFO 3.0లో ఎర్రర్ కరెక్షన్ సిస్టమ్ మెరుగ్గా ఉంది. ఫామ్ నింపేటప్పుడే ఎక్కడైనా తప్పు ఉంటే మీకు తెలిసిపోతుంది.

పూర్తిగా డిజిటల్: EPFO 3.0 పూర్తిగా డిజిటల్ కావడంతో మీరు మీ క్లెయిమ్ స్టేటస్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. మానవ ప్రమేయం తగ్గడంతో అవినీతి తగ్గడంతో పాటు ఆలస్యం అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

కేంద్రీకృత పెన్షన్ వ్యవస్థ (Centralized Pension System)
EPFO 3.0 కింద చేపట్టిన అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ప్రారంభం. జనవరి 1, 2025 నుండి అన్ని EPFO ఆఫీసుల్లో ఈ వ్యవస్థ పూర్తిగా అమలులోకి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు పెన్షన్ చెల్లింపులు ఒకే కేంద్రం నుండి ప్రాసెస్ అవుతాయి. భారత్ అంతటా ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా పొందవచ్చు. ఈ చొరవ వల్ల ప్రతి నెలా 70 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. CPPS ద్వారా పెన్షన్ చెల్లింపులు వేగంగా, గతంలో పెన్షనర్లు ఎదుర్కొన్న ఆలస్యం, పొరపాట్లు తగ్గుతాయని సమాచారం.

కనీస పెన్షన్ అప్‌డేట్
EPS పెన్షన్ పెంపుదలపై దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్పును ప్రకటించలేదు. ప్రస్తుతం EPS కింద కనీస పెన్షన్ నెలకు 1000 రూపాయలుగా ఉంది. దీనికి యజమానుల వాటా (8.33%), ప్రభుత్వ వాటా (1.16%) నుండి నిధులు అందుతాయి. సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే నిధుల స్థిరత్వం, భవిష్యత్తు బాధ్యతల మధ్య బ్యాలెన్స్ పాటించడం అవసరమని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

అమ్నెస్టీ స్కీమ్ 2025: నమోదు పెంపు
ఎంప్లాయీ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ 2025 కింద జరిగిన అప్‌డేట్ ప్రభుత్వం వివరించింది. ఈ పథకం కింద 4,815 సంస్థలు పాల్గొన్నాయి. 39,000 కంటే ఎక్కువ యూనివర్సల్ అకౌంట్ నంబర్లు (UAN) జారీ అయ్యాయి. మార్చి 2026 నుండి అమలులోకి వచ్చే PM-VBRY పథకం కింద లభించే ప్రయోజనాలు, అర్హత పొందిన 6 నెలల తర్వాత అందుబాటులో ఉంటాయి.