Electric Cars Fire Safety Tips: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల స్పీడ్ పెరుగుతోంది భారీ సంఖ్యలో ఈ వాహనాల కొనేందుకు జనం ఎగబడుతున్నారు. అదే టైంలో జరుగుతున్న ప్రమాదాలు, వాటి పని తీరుపై చాలా అనుమానాలు ఉన్నాయి. వీటికి ఈ మధ్య మహీంద్రా BE 6 EVలో చెలరేగిన మంటలు వాటికి ఆజ్యం పోశాయి. దీంతో EV భద్రత గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటన EV యజమానులకు అనేక సంకేతాలు ఇస్తోంది. వాహన వినియోగదారులు టెక్నాలజీపై ఎంత ఆసక్తి పెడుతున్నారో, ఉపయోగంలో అంతే ఆసక్తి, జాగ్రత్త ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల మంటలకు ప్రధాన కారణాలు బ్యాటరీ వేడెక్కడం, సరికాని ఛార్జింగ్ విధానం, తప్పు వైరింగ్ లేదా ప్రమాదం తర్వాత బ్యాటరీ దెబ్బతినడం. కాబట్టి, మంటలను నివారించడానికి ప్రతి EV యజమాని అనుసరించాల్సిన ఐదు భద్రతా చిట్కాలు గురించి చూద్దాం.

మహీంద్రా BE 6 అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం

కారు డేటా ప్రకారం, వెనుక-కుడి టైర్ పూర్తిగా పంక్చర్ అయినప్పటికీ, వాహనం దాదాపు 10 నిమిషాల పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచింది. అయినప్పటికీ, డ్రైవ్ కొనసాగింది. టైర్ ప్రెజర్ హెచ్చరికలు పదేపదే కనిపించాయి, ESP, TCS వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. అధిక ఘర్షణ కారణంగా టైర్ వేడెక్కింది. బ్యాటరీ నుంచి కాకుండా టైర్ రబ్బరు నుంచి మంటలు చెలరేగాయని వీడియో విశ్లేషణలో వెల్లడైంది.

1. క్రమం తప్పకుండా బ్యాటరీ లైఫ్‌ను చెక్ చేయాలి

బ్యాటరీ అనేది EVలో కీలకమైన భాగం. వేడెక్కడం, ఉబ్బడం లేదా ఏదైనా సాంకేతిక లోపాలను సకాలంలో గుర్తించడానికి అధికారిక సేవా కేంద్రంలో బ్యాటరీని కాలానుగుణంగా తనిఖీ చేయడం చాలా అవసరం. ఓవర్‌ఛార్జింగ్‌ను నివారించడం, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను ఫ్రెష్‌గా ఉంచడం కూడా చాలా ముఖ్యం.

2. సరైన ఛార్జింగ్ కేబుల్ ఉపయోగించండి

ఎల్లప్పుడూ కంపెనీ చెప్పిన ఛార్జర్, కేబుల్‌ను ఉపయోగించండి. చౌకైన లేదా స్థానికంగా తయారు చేసిన ఛార్జర్‌లు షార్ట్ సర్క్యూట్‌లు, వేడెక్కడం ప్రమాదాన్ని పెంచుతాయి. ఛార్జింగ్ సమయంలో వేడిని వెదజల్లడానికి వీలుగా ఆ ప్రాంతాన్ని వెంటిలేషన్‌లో ఉంచడం కూడా ముఖ్యం.

3. పార్కింగ్ విషయంలో జాగ్రత్త అవసరం

మీ EV ని చాలా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువసేపు పార్క్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. మండే పదార్థాలకు దూరంగా, నీడ ఉన్న ప్రదేశాల్లోనే పార్క్ చేయడానికి ప్రయత్నించండి.

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విస్మరించవద్దు

EV భద్రత ఎక్కువగా దాని సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణ అప్‌డేట్‌లను బ్యాటరీ నిర్వహణ, హీట్‌ నియంత్రణను మెరుగుపరుస్తాయి, కాబట్టి వాటిని ఇన్‌స్టాల్ చేయడం మర్చిపోవద్దు.

5. హెచ్చరిక సంకేతాలు తేలికగా తీసుకోవద్దు

మీ డాష్‌బోర్డ్‌లో మీకు అలర్ట్ వస్తే, వింత వాసన వస్తే, లేదా పొగ కనిపిస్తే, వెంటనే మీ వాహనాన్ని ఆపి నిపుణుల సహాయం తీసుకోండి. సకాలంలో చర్య తీసుకుంటే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు.