East Godavari Latest News: పింగానీ ప్లేట్లలో ఘుమఘమలాడే పసందైన వంటకాలని తెగ లాగించేస్తున్నారా..? మటన్‌ ఫ్ల్రై, ప్రాన్‌ఫ్రై ఏముందబ్బా అంటూ లొట్టలేసుకుని తినేస్తున్నారా... అయితే ఇది మీకోసమే... ఘుమఘుమలాడే పసందైన వంటకాల్లో అన్నీ పాచిపోయిన పదార్ధాలే ఉంటున్నాయని మీకు తెలుసా...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు హోటళ్లపై ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు చేసిన దాడులుచేశారు. ఆ దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాల గురించి తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. అదీ ఇదీ అని కాదు దాడులు చేసిన దాదాపు అన్ని హోటళ్లలోనూ ఫ్రిజ్‌ల్లో వారాలు తరబడి మగ్గిపోయి కంపుకొడుతున్న చికెన్‌, మటన్‌, ఇతర మాంసాహార పదార్ధాలు లభ్యమయ్యాయి. హోటళ్లలో తినడం ఎంత ప్రమాదకరమో తేటతెల్లం చేస్తున్నాయి.

కేవలం నాన్‌వెజ్‌ హోటళ్లలోనే ఈ దారుణాలుంటాయని అనుకుంటే మీరు తప్పుచేసినట్టే. ఎంతో ఫేమస్‌ అని చెప్పుకునే కాకినాడ సుబ్బయ్య హోటళ్లలోనూ పాచిపోయి కంపు కొడుతున్న పదార్ధాలు లభ్యం అవ్వడం షాక్‌కి గురి చేస్తోంది. ఆ దృశ్యాలు తలచుకుంటేనే వికారం కలుగుతుంది.

అధికారుల దాడుల్లో బట్టబయలు..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణ ప్రాంతంలో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అమలాపురం పట్టణంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తూర్పుగోదావరి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రొక్కయ్య, కోనసీమ జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రముఖ హోటళ్లపై దాడులు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రోజుల తరబడి నిల్వచేసిన మాంసాహార పదార్ధాలు పాచిపోయి కంపుకొడుతూ కనిపించాయి. ప్రిజ్‌లలో పాచికంపు కొడుతున్న మటన్‌, చికెన్‌, రొయ్యలు లభ్యమవ్వడంతో అధికారులు మున్సిపల్‌ చెత్త వాహనం రప్పించి డంపింగ్‌ యార్డుకు తరలించారు. పలు హోటళ్లలో అత్యంత దారుణంగా ఉన్న కిచెన్‌లను సీజ్‌ చేసి నోటీసులు ఇచ్చారు. ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఫుడ్‌ లైసెన్స్‌లు లేకుండా చేస్తున్న వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు.

Also Read: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నారా ? - ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి

శాఖాహార హోటళ్లలోనూ...
కాకినాడ సుబ్బయ్య హోటల్‌ అంటే చాలా ఫేమస్‌.. కాకినాడ వెళ్లారంటే తప్పనిసరిగా సుబ్బయ్య హోటల్‌కే వెళ్లే పరిస్థితి ఉంటుంది.. అరటి ఆకులో పదుల సంఖ్యలో వడ్డించే ఐటెంలతో నోరూరిస్తారు. కొసరి కొసరి మరీ వడ్డిస్తారు.. అయితే అదే సుబ్బయ్య హోటల్‌లో భోజనం చేస్తే రోగాలు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు అధికారులు. ఇటీవలే ఈ హోటళ్లపై అధికారులు చేసిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడుల్లో అక్కడ కాలం చెల్లిన ఆహార పదార్ధాలు వినియోగిస్తుండగా విక్రయిస్తు పచ్చళ్లు, పొడులు అన్నీ కాలం చెల్లినవేనని తేలింది. అంతేకాదు అపరిశుభ్రతతో కూడిన కిచెన్‌లు, పాత్రలు ఇలా అన్నీ కంపుకొడుతూ అధికారులకు కంటపడ్డాయి. కాకినాడలోని సుబ్బయ్య మెయిన్‌ హోటల్‌లోనే కాకుండా అక్కడే ఉన్న వారి సోదరుల రెండు హోటళ్లలోనూ ఇదే పరిస్థితి అధికారులకు కనిపించింది. దీంతో మూడు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. ఓ కస్టమర్‌ వాట్సాప్‌ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో దాడులుచేసిన అధికారులకు వాస్తవాలు కంటపడడం నెవ్వరపరిచింది.

Also Read: తిరుపతి మేయర్‌పై కార్పొరేటర్ల అసంతృప్తి- వచ్చే నెలలో అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్