Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న డోనాల్డ్ ట్రంప్.. పదవి చేపట్టిన వెంటనే అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను అధికారం చేపట్టాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానంటూ ట్రంహ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశవ్యాప్తంగా నమోదుకాని వలసదారులపై సామూహిక అరెస్టులను నిర్వహిస్తారని సమాచారం. ఇది వారం పాటు కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ నివేదిక ప్రకారం, అధికారంలోకి రాగానే చేసే మొదటి చేసే పని ఏంటంటే.. అమెరికాలో నివసిస్తోన్న, అమెరికాకు వచ్చిన మిలియన్ల మంది పత్రాలు లేని వలసదారులను ట్రంప్ బహిష్కరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో భాగంగా.. ఎంతో ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ పై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. బార్డర్ జార్ (border czar) అనే పేరుతో ఈ మిషన్ ను చికాగో నుంచి ప్రారంభిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనంలో తెలిపింది. దాదాపు వారం పాటు సాగే ఈ దాడుల్లో 200మంది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు పాల్గొననున్నారు. ఇది కేవలం చికాగోకే పరిమితం కాకుండా.. దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే న్యూయార్క్, మియామి వంటి పెద్ద నగరాల్లో అక్రమ వలసదారుల అరెస్టులు భారీ మొత్తంలో జరగనున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై స్పందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) మాజీ యాక్టింగ్ డైరెక్టర్ హోమన్.. "దేశవ్యాప్తంగా పెద్ద దాడి జరగబోతోంది. అనేక ప్రదేశాలలో ఒకటైన చికాగో నుంచి ఇది ప్రారంభం కాబోతోంది" అన్నారు. చట్ట విరుద్ధంగా దేశంలో ఉన్న వారికి సమస్య పొంచి ఉందని, ఈ విషయంలో ఎవరినీ క్షమించేది లేదని చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ పాలనలో గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా 2లక్షల 71వేల మంది సరైన పత్రాలు లేదా డాక్యుమెంట్స్ లేని వలసదారుల్ని బహిష్కరించారు. అయితే ఈ సారి ఈ సంఖ్యను ట్రంప్ అధిగమిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

ట్రంప్ మునుపు 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి, నాలుగేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్.. అమెరికాని ఏలబోతున్నారు. అయితే ఇటీవల అకస్మాత్తుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రదేశాన్ని మార్చేసి.. బయట కాకుండా.. ఇండోర్‌లో రొటుండా కాంప్లెక్స్‌లో జరపాలని ట్రంప్ ఆదేశించారు. 1985 తర్వాత ఇలా ఇండోర్‌లో ఈ కార్యక్రమం జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Also Read : Stray Dogs Killing In Morocco : 30 లక్షల కుక్కలను చంపేందుకు ప్రభుత్వం ప్లాన్ - మండిపడుతున్న జంతు ప్రేమికులు