Donald Trump Reaction : నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి గాను వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో పేరును నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. మరియా కొరినా మచాడో గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది. జనవరి 2025లో వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినందుకు మరియా కొరినాను ట్రంప్ ప్రశంసించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ,"వెనిజులా ప్రజాస్వామ్య కార్యకర్త మరియా కొరినా మచాడో లక్షలాది మందితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. వారు వెనిజులా ప్రజల గొంతుకను, కోరికను వ్యక్తపరుస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వెనిజులా-అమెరికన్ కమ్యూనిటీ ప్రజలు స్వేచ్ఛాయుతమైన వెనిజులాకు మద్దతు ఇస్తున్నారు. నాకు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ స్వాతంత్ర్య సమరయోధులకు ఎటువంటి హాని జరగకూడదు. వారు సురక్షితంగా, సజీవంగా ఉండాలి." అని అన్నారు.

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలలో యుద్ధాన్ని ముగించానని పేర్కొంటూ నోబెల్ శాంతి బహుమతికి తన పేరును ప్రతిపాదించుకున్నారు. కొరినా మచాడో పేరును ప్రకటించడంతో అమెరికా అధ్యక్షుడి ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నోబెల్ కమిటీ వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపునకు తీసుకువెళ్లడంలో ఆమె నాయకత్వం, పోరాటాన్ని ప్రస్తావించింది.

ది నోబెల్ ప్రైజ్ X ఖాతాలో ప్రకటన చేస్తూ, "నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంలోకి న్యాయబద్ధమైన, శాంతియుత మార్పు కోసం చేసిన కృషికి మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నిర్ణయించింది." అని రాశారు. మరియా కొరినా ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారని ప్రశంసించారు. ఆమె ఎంపిక లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమన్నారు.

వారాల తరబడి ఊహాగానాలు సాగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. బదులుగా, ఈ అవార్డు ఒక మహిళకు దక్కింది, ఆమె నిరంకుశత్వాన్ని ధిక్కరించడం ఆమెను లాటిన్ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా నిలబెట్టింది.

మడురో పాలనను ధిక్కరిస్తూ

దశాబ్దాలుగా, మచాడో వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమంలో ముందంజలో ఉంది, నికోలస్ మడురో అణచివేత పాలనను బహిరంగంగా సవాలు చేశారు. బెదిరింపులు, అరెస్టులు, రాజకీయ హింసను భరించారు. అయినప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉండాలని కొరుకున్నారు. శాంతియుత ప్రతిఘటన, స్వేచ్ఛా ఎన్నికల కోసం ఆమె పట్టుదల లక్షలాది మందికి ఆశాకిరణంగా మారింది.

ఆమె నాయకత్వం ఒకప్పుడు చెల్లాచెదురుగా పడి ఉన్న ప్రతిపక్షాన్ని ఒకచోట చేర్చిందని, రాజకీయ సరిహద్దులకు అతీతంగా పౌరులను ఏకం చేసి విధానాన్ని నోబెల్ కమిటీ గుర్తించింది. వెనిజులా వివాదాస్పద 2024 ఎన్నికల సమయంలో - ప్రభుత్వం ఆమెను పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించినప్పుడు - ఆమె ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియాకు తన మద్దతును ఇచ్చారు.

అప్పటి ప్రభుత్వ బెదిరింపుల మధ్య కూడా, పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి, ఓటర్లను సమీకరించడానికి అక్రమాలు ఎదుర్కోవడానికి మచాడో నాయకత్వం వహించారు. "ప్రజాస్వామ్య సాధనాలు కూడా శాంతి సాధనాలే అని మరియా కొరినా మచాడో చూపించారు" అని కమిటీ పేర్కొంది. "పౌరుల ప్రాథమిక హక్కులు రక్షించడం మరియు వారి గొంతులు వినిపించే భిన్నమైన భవిష్యత్తు ఆశకు ఆమె మార్గదర్శకులు." అని అభిప్రాయపడ్డారు.

మరియా కొరినా మచాడో ఎవరు?

రాజకీయ నాయకురాలు, కార్యకర్త: లిబరల్ పార్టీ వెంతే వెనిజులా సహ వ్యవస్థాపకురాలు, జాతీయ సమన్వయకర్త. 2010 నుంచి 2015 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు.

ప్రజాస్వామ్య వేదికల వ్యవస్థాపకురాలు: స్వేచ్ఛా ఎన్నికలను ప్రోత్సహించే పౌర సమాజ సమూహం సుమాతే, ప్రజాస్వామ్య పరివర్తనకు పిలుపునిచ్చే సంకీర్ణ సంస్థ సోయా వెనిజులాను స్థాపించడంలో సహాయపడ్డారు.

ధిక్కార స్వరం: ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించిన తర్వాత 2014లో పార్లమెంటు నుంచి బహిష్కణకు గురయ్యారు. ఆమె రాజద్రోహం, కుట్ర, పదేపదే రాజకీయ నిషేధాల ఆరోపణలను ఎదుర్కొన్నారు.

అంతర్జాతీయ గుర్తింపు: 2018లో BBC 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా పేరుపొందారు; చార్లెస్ టి. మనాట్ డెమోక్రసీ అవార్డు (2014), లిబర్టాడ్ కోర్టెస్ డి కాడిజ్ ప్రైజ్ (2015), లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్ (2019) విజేత.

ఆర్థిక దృక్పథం: చమురు రంగాన్ని ప్రైవేటీకరించడం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సంబంధాలను పునరుద్ధరించడం వంటి వెనిజులా ఆర్థిక వ్యవస్థను సరళీకరించడానికి మద్దతుదారులు - ఈ విధానాన్ని తరచుగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో పోల్చారు.

విద్యా నేపథ్యం: యూనివర్సిడాడ్ కాటోలికా ఆండ్రెస్ బెల్లో నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, IESA నుంచి ఫైనాన్స్ స్పెషలైజేషన్‌ను కలిగి ఉన్నారు.