Diwali Celebrations in Nepal : దీపావళి వెలుగుల పండుగ. దీనిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. భక్తులు ఈ శుభ పర్వదినాన లక్ష్మీ దేవిని పూజ చేస్తారు. మరికొందరు విఘ్నాలను తొలగించే గణేశుడికి పూజలు చేస్తారు. దాదాపు దీపావళిని ఇండియాలోనే జరుపుకుంటారు. అయితే మీకు తెలుసా? దీపావళిని నేపాల్లో కూడా జరుపుకుంటారు. కానీ దీనిని ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంటారు. దీపావళిని నేపాల్‌లో తిహార్ అని పిలుస్తారు. అలాగే దీనిని ఐదు రోజులు జరుపుకుంటారు. మరి ఈ తిహార్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తిహార్ అంటే ఏమిటి?

తిహార్‌ని యమ పంచక్ అని కూడా అంటారు. దీనివెనుక యమరాజు, అతని సోదరి యమునతో ముడిపడిన కథ ఉందని చెప్తారు. ఈ పండుగ ప్రకృతి, జీవుల పట్ల గౌరవాన్ని సూచిస్తుందని భావిస్తారు. ఈ పండుగలో 5 రోజులు.. ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేక ఆచారం ఫాలో అవుతారు. అవేంటో చూసేద్దాం.

మొదటి రోజు కాగ్ తిహార్

తిహార్ మొదటి రోజును కాగ్ తిహార్ అంటారు. ఇది కాకులకు అంకితం చేశారు. వాస్తవానికి కాకులను యముడి దూతలుగా భావిస్తారు. ఈ రోజున భక్తులు.. కాకులకు మిఠాయిలు, ధాన్యం తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల రానున్న రోజుల్లో తమ ఇళ్లలో దుఃఖం తొలగిపోతుందని, అదృష్టం వస్తుందని భావిస్తారు.

రెండవ రోజు కుక్కూర్ తిహార్

రెండవ రోజు కుక్కూర్ తిహార్ జరుపుకుంటారు. ఇది కుక్కలకు అంకితం చేశారు. కుక్కలను యమరాజు రక్షకులుగా, దూతలుగా భావిస్తారు. శునకాల నుదుటిపై తిలకం పెడతారు. వాటికి రుచికరమైన ఆహారం అందిస్తారు.

మూడవ రోజు గాయ్ తిహార్

మూడవ రోజున ఆవులను పూజిస్తారు. ఆవులు హిందూ సంస్కృతిలో ధనం, సమృద్ధికి చిహ్నంగా చెప్తారు. సాయంత్రం ఇళ్లను దీపాలు, లైట్లతో అలంకరిస్తారు. లక్ష్మీ పూజ చేస్తారు.

నాల్గవ రోజు గోరు తిహార్

నాలుగో రోజు ఎద్దులకు అంకితం చేశారు. వ్యవసాయంలో ఎద్దుల కష్టానికి గౌరవం ఇవ్వడానికి ఈ రోజు అంకితం చేశారు. మానవ జీవనోపాధిని కొనసాగించడంలో జంతువుల ముఖ్యమైన పాత్ర, వాటి పట్ల కృతజ్ఞతను తెలిపేందుకు వీటిని నిర్వహిస్తారు.

ఐదవ రోజు భాయ్ దూజ్

ఐదవ రోజున భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఇది సోదర సోదరీమణుల మధ్య పవిత్రమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం పెడతారు. వారి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం పూజలు చేస్తారు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. ఓ రకంగా ఇది మన రాఖీ పండుగలాంటిది.

ఈ విధంగా నేపాల్లో దీపావళి సమయంలో తిహార్ జరుపుకుంటారు. దేశాలు మారినా.. పండుగల్లో మార్పులు ఉన్నా.. అందరూ కోరేది శ్రేయస్సే.