Dream of devotees comes true at Rama Tirtha: శ్రీరామనవమి పర్వదినానికి రెండు రోజుల ముందే రామతీర్థం భక్తులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవమికి ముందే రాములోరికి గిరి ప్రదక్షిణ సుమమాల అందించింది. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర నిర్మించిన గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గతంలో రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలతో నిండి భక్తులకు నరకప్రాయంగా ఉన్న ఈ మార్గాన్ని రూ. 3.40 కోట్ల ఉపాధి హామీ (NREGS) నిధులతో సుందరమైన బీటీ రోడ్డుగా తీర్చిదిద్దారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి విన్నపం మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేశారు.

నాడు వేదన.. నేడు అభివృద్ధి జాడ

గత ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో రాములవారి విగ్రహం శిరచ్ఛేదానికి గురైన ఘటన తనతో పాటు కోట్లాది మంది హిందువులను తీవ్ర వేదనకు గురిచేసిందని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆనాడు భక్తులు అనుభవించిన బాధను నేడు అభివృద్ధి ద్వారా తుడిచివేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల పవిత్రతను కాపాడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వామివారికి గిరి ప్రదక్షిణ మార్గం రూపంలో సేవ చేసుకునే భాగ్యం కలగడం తన అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఆలయాల అభివృద్ధికి రూ. 40 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గడచిన 20 నెలల కాలంలో రూ. 40 కోట్లకు పైగా నిధులతో 22 ప్రధాన ఆలయాలకు రహదారి వసతులు కల్పించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

నవమికి ముందే రాములోరికి గిరి ప్రదక్షిణ సుమమాల

* రామతీర్థంలో నాటి వేదన బాధ.. నేడు అభివృద్ధి జాడతో తీరింది
* రూ. 3.40 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం
* ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు వసతి కల్పించాం
* శ్రీకాళహస్తి గిరి… pic.twitter.com/JVOKH1HcXP

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2026

ప్రజాప్రతినిధుల సమక్షంలో వేడుక

వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ లతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామతీర్థం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకమని, ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఏర్పడటంతో వైకుంఠ ఏకాదశి, శివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులకు ప్రయాణం సుఖమయం కానుందని అధికారులు వెల్లడించారు.