Population Based Lok Sabha Seats Divide: భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమై, సున్నితమైన అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలోని డొనాల్డ్ ట్రంప్ తరహా కఠినమైన నిర్ణయాలతో దూసుకుపోతున్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్‌లో మిత్రపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా ఒంటరిగానే మూడింట రెండు వంతుల బలాన్ని దక్కించుకున్న తరుణంలో ఈ ముప్పు మరింత జటిలంగా మారింది. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం వస్తున్న యాభై శాతం సీట్ల పెంపు ఫార్ములా ను కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పి. చిదంబరం, శశిథరూర్ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జనాభా ప్రకారం చేపడితే దక్షిణాదికి తీవ్ర నష్టం

ప్రస్తుతం కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న 50% సీట్ల పెంపు ఫార్ములా ప్రకారం.. లోక్‌సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుండి దాదాపు 800 పైచిలుకు పెంచాలని చూస్తున్నారు. అయితే, జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాల పిలుపుని అందుకొని, జనాభా నియంత్రణ ను అద్భుతంగా అమలు చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక పన్నుల రూపంలో వాటా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు రాజకీయంగా తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. జనాభాను ఇష్టారాజ్యంగా పెంచేసిన ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల కేవలం ఉత్తరాది సీట్లను గెలుచుకుంటేనే కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే ప్రమాదకరమైన రాజకీయ అసమతుల్యత ఏర్పడుతుంది.

జీడీపీని లెక్కలోకి తీసుకోవాలంటున్న కాంగ్రెస్

ఈ వివక్షను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పి. చిదంబరం ఒక ప్రత్యామ్నాయ వ్యూహాత్మక ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. కేవలం జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదని, నియోజకవర్గాల విభజనలో జీడీపీ కంట్రిబ్యూషన్, అక్షరాస్యత, జనాభా నియంత్రణ సాఫల్యత వంటి కీలక సూచీలకు సమాన ప్రాధాన్యత లేదా వెయిటేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేవలం జనాభా ప్రకారమే సీట్లు పెంచాల్సి వస్తే, అమెరికాలోని సెనేట్ తరహాలో భారతదేశంలో కూడా రాజ్యసభ లో జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన సంఖ్యలో సీట్లు కేటాయించేలా రాజ్యాంగ సవరణ చేయాలని లేదా దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్య శాతం తగ్గకుండా ప్రత్యేక రక్షణ కల్పించాలని కాంగ్రెస్ వాదిస్తోంది.

బీజేపీకి తిరుగులేని మెజార్టీ

ఒకవేళ ఏకాభిప్రాయం లేకుండా, ప్రస్తుత పార్లమెంట్‌లో తమకున్న టూ-థర్డ్స్ మెజారిటీ ని అస్త్రంగా వాడుకుని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాజ్యాంగంలో ఉన్నట్లుగానే చేస్తున్నామని చెప్పి కేవలం జనాభా ప్రకారమే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేస్తే.. దానికి పూర్తి బాధ్యత ప్రస్తుత కేంద్ర పాలకులు, వారికి వంతపాడుతున్న రాజకీయ శక్తులే వహించాల్సి ఉంటుంది. ఇది దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని (Federalism) పూర్తిగా ఖూనీ చేయడమే అవుతుంది. జనాభాను నియంత్రించి దేశాభివృద్ధికి తోడ్పడినందుకు దక్షిణాదికి ఇచ్చే బహుమతి ఇదేనా? అనే తీవ్రమైన అసంతృప్తి ప్రాంతీయ తత్వానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించే సివిల్ వార్ తరహా ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చారిత్రక తప్పిదానికి కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీ అవుతుంది.

ఏకాభిప్రాయంతోనే చేస్తేనే ప్రయోజనం

నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ కాదు, అది భారతదేశ భవిష్యత్తును, ఉత్తరాది-దక్షిణాది ఐక్యతను శాసించే ఒక రాజకీయ బాంబు లాంటిది. కేంద్రం తనకున్న సంఖ్యాబలంతో మొండిగా ముందుకు వెళ్లకుండా, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు మరియు దక్షిణాది ప్రాంతీయ పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష పడకుండా, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల రాజకీయ గొంతు నొక్కేయకుండా ఒక ఫెడరల్ ఫార్ములా ను తీసుకురావాల్సిన బాధ్యత నేడు పాలకులపై ఉంది.