<p>న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దాంతో రాజకీయంగా ఎంతో దుమారం రేపిన కేసు నుంచి కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలియగానే మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశారు.</p>
<p>గత కొన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ మోపిన అభియోగాల నుంచి వీరికి విముక్తి కల్పించింది. సీబీఐ అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తమ తీర్పులో పేర్కొంది. బీజేపీ నేతలు ఈ వివాదాస్పద ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ కేసు ఆరోపణలు, కేజ్రీవాల్ సహా ఆప్ మంత్రులు జైలుకు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. ఈ పరిణామాలతో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని తెలిసిందే. </p>
<p>శుక్రవారం లిక్కర్ పాలసీ కేసు విచారణ కోసం కేజ్రీవాల్ అంతకుముందే రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. కోర్టు హాలులో జరిగిన ఈ ప్రొసీడింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆప్ నేతలు, మద్దతుదారులు ఆశించినట్లుగానే కోర్టు వారికి ఊరట కలిగిస్తూ క్లీన్ చిట్ ఇచ్చేసింది. </p>