Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం (నవంబర్ 10, 2025) భారీ పేలుడు జరిగింది. ఇప్పటివరకు పదకొండు మంది మరణించినట్లు నిర్దారించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పేలుడు ఘటనను అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు పేలింది. పేలుడులో కొంతమంది పాదచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన 10 నిమిషాల్లోనే, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "ఎఫ్‌ఎస్‌ఎల్‌తోపాటు ఎన్‌ఎస్‌జి, ఎన్‌ఐఏ బృందాలు ఇప్పుడు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నేను ఢిల్లీ పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్‌తో కూడా మాట్లాడాను. మేము అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము. వాటి ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది.”

పేలుడు తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, 'ఈ రోజు సాయంత్రం 6.52 గంటలకు ఎర్ర లైట్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న కారు ఆగింది. ఆ కారులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న వాహనాలకు కూడా నష్టం వాటిల్లింది. అన్ని ఏజెన్సీలు, FSL, NIA ఇక్కడ ఉన్నాయి. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. కొంతమంది గాయపడ్డారు. పరిస్థితిని గమనిస్తున్నాం. హోంమంత్రి కూడా మమ్మల్ని అడిగారు. ఎప్పటికప్పుడు వారితో సమాచారం పంచుకుంటున్నాం.' అని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాయపడిన వారిని పరామర్శించడానికి ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి గురించి ఆరా తీశారు.

NSG, NIA దర్యాప్తు ప్రారంభం

పేలుడు జరిగిన కొన్ని నిమిషాల తర్వాత హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి, బహుళ కేంద్ర, స్థానిక సంస్థలతో సమన్వయంతో దర్యాప్తు ప్రారంభించారు. NSG, NIA, ఫోరెన్సిక్ యూనిట్ల బృందాలను వెంటనే మోహరించాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో హోంమంత్రితో నిరంతరం కమ్యూనికేషన్ కొనసాగించింది. పేలుడు జరిగిన వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వాహనాల చుట్టూ ఆధారాల సేకరిస్తున్నారు.

పార్క్ చేసిన కారులో పేలుడు జరిగిన వెంటనే అది దాదాపు తక్షణమే మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మంటలు సమీపంలోని ఇతర వాహనాలకు వ్యాపించాయి. "ఒక కారులో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత పేలుడు సంభవించి మూడు నుంచి నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. మొత్తం ఏడు అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి" అని అధికారులు ధృవీకరించారు.