<p>అమరావతి: గత రెండు రోజులుగా టెన్షన్ పెట్టిన అర్నాబ్ తుపాను తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకున్నప్పటికీ, దాని తీరం దాటే ప్రక్రియ అంచనా వేసిన దానికంటే నిలకడగా జరిగినట్లు వాతావరణశాఖ తెలిపింది. అర్ధరాత్రి దాటాక సుమారు 1:20 గంటల ప్రాంతంలో యానాంకు దక్షిణంగా, నరసాపురం సమీపంలో ఈ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత తుపాను దాదాపు ఒకే చోట నిలకడగా కేంద్రీకృతమై ఉండటంతో అర్నబ్ తీరం దాటే ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 140 కిలోమీటర్ల దాకా తీవ్రమైన ఈదురుగాలులు వీచాయని అధికారులు వెల్లడించారు.</p>
<p>రాబోయే గంటల్లో ఈ తుపాను నెమ్మదిగా వాయవ్య దిశ నుంచి ఉత్తర-వాయవ్య దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధవారం నాడు అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.పొరుగున ఉన్న దక్షిణ ఒడిశాలోని కోరాపుట్, రాయగడ, గజపతి తదితర సరిహద్దు జిల్లాల్లో సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. </p>
<p>తీరప్రాంత ఏపీలో అక్టోబర్ 28న సాయంత్రం నుంచి బలమైన గాలుల తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు మాత్రం అక్టోబర్ 29 వరకు కొనసాగవచ్చు అని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో అక్టోబర్ 29 నుండి 30 మధ్య వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అయితే ప్రస్తుతం తుపాను ఈదురుగాలుల కంటే నిరంతరం కురుస్తున్న వర్షాలు, దాంతో వచ్చే వరదలపైనే ఆందోళన పెరిగింది. అర్నబ్ బలహీనపడినప్పటికీ, ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉన్న జలాశయాలు, నిరంతరం కురిసే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు పొంచి ఉంది.</p>