Cyclone Arnab Landfall | అమరావతి: అర్నబ్ అతి తీవ్ర తుపాను తీరం దాటే ప్రక్రియ గడిచిన రెండు గంటలుగా నిలకడగా కొనసాగుతోంది. రాత్రి నుంచి ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అర్నబ్ తుపాను నరసాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. యానాంకి దక్షిణంగా, నరసాపురానికి సమీపంలో అర్నబ్ తుపాను తీరాన్ని తాకింది. మధ్యాహ్నానికి అర్నబ్ తుపాన్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు తీరం వెంబడి అత్యంత బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ఈ జిల్లాల్లో తీరంలో భీకర గాలులు

ప్రస్తుతం ఈ తుపాను నరసాపురానికి 30 కిమీ, యానాంకు 55 కిమీ, కాకినాడకు 70 కిమీ, మచిలీపట్నంకు 90 కిమీ దూరంలో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రాగల మూడు గంటల్లో కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రెండు గంటలుగా నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతం మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం తీరం వెంబడి కొనసాగనున్న బలమైన ఈదురుగాలులు, వర్షాలు ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల సంస్థ. https://t.co/N2Ucl9FubT

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 28, 2026

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ తుపాను ప్రభావంతో పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్. కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రోజు రోజంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

అర్నబ్ తుపాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు

'అర్నబ్' తుపాను వల్ల కలిగే నష్టాన్ని కనిష్టం చేయడానికి అత్యాధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన సీఎం, ముందస్తు జాగ్రత్తల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందన్నారు. బాధితులకు వేగంగా సహాయం అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుతున్నట్లు తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, బాధితులకు అవసరమైన ఆహారం, అత్యవసర మందులను వేగంగా అందజేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ ద్వారా సహాయక సామగ్రిని నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

బుధవారం సైతం స్కూళ్లకు సెలవులు
పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నందున రాత్రి వేళల్లో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించడం తప్పదన్నారు. ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం సైతం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.