New Cybersecurity Rules: భారతదేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నిబంధనలు ఎయిర్‌టెల్, జియో, BSNL (బీఎస్ఎన్ఎల్), Vi (Vodafone Idea) వంటి ప్రధాన టెలికాం కంపెనీలకు మాత్రమే కాకుండా.. ఆర్థిక సంబంధిత, బీమా రంగానికి కూడా వర్తిస్తాయి. టెలికాంయేతర కంపెనీలను DoT పరిధిలోకి తీసుకురావడం వినియోగదారుల గోప్యత (Customers Privacy)కు సవాలుగా మారుతుందని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

DoT కొత్త నిబంధనల్లో మార్పు

Economic Times Telecom నివేదిక ప్రకారం.. ఈ కొత్త నిబంధనల లక్ష్యం టెలికాం ఆపరేటర్లను బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలతో అనుసంధానం చేయడం. తమ నియంత్రణ అధికారం లైసెన్స్ పొందిన టెలికాం ఆపరేటర్లకు మాత్రమే పరిమితం చేశామని, ఈ కొత్త నిబంధనలు లైసెన్స్ లేని కంపెనీలను నియంత్రించడానికి ఉద్దేశించినవి కావని DoT స్పష్టం చేసింది.

మొబైల్ నంబర్ ధృవీకరణ వేదిక (MNV) అంటే ఏమిటి?

సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధనలలో ముఖ్యమైన భాగం మొబైల్ నంబర్ వెరిఫికేషన్ (MNV) వేదిక, దీనిని DoT త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఉద్దేశ్యం ఏమిటంటే, మొబైల్ నంబర్ యజమాని KYC (నో యువర్ కస్టమర్) రికార్డ్‌లలో పేర్కొన్న వ్యక్తి వారేనా, కాదా అని చెక్ చేయడం.

బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, బీమా సంస్థలు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొత్త అకౌంట్స్ తెరిచేటప్పుడు కస్టమర్‌ల మొబైల్ నంబర్‌లను ధృవీకరించగలవు. దీని ద్వారా ఏదైనా బ్యాంక్ ఖాతా లేదా బీమా పాలసీకి లింక్ చేసిన మొబైల్ నంబర్ సరైన వ్యక్తిదేనా అని నిర్ధారించవచ్చు, తద్వారా మోసం, సైబర్ నేరాలను నిరోధించే అవకాశం ఉంది.

సైబర్ మోసాలను ఎలా అడ్డుకుంటుంది?

ఇప్పటివరకు మొబైల్ నంబర్ ఖాతాదారుడిదేనా కాదా అని తనిఖీ చేయడానికి బ్యాంకులకు లేదా సంస్థలకు వీలు కల్పించే చట్టపరమైన వ్యవస్థ భారతదేశంలో లేదని తెలిసిందే. DoT తీసుకొచ్చ్చిన ఈ కొత్త MNV ప్లాట్‌ఫారమ్ ఈ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఆ రూల్స్ ద్వారా బ్యాంకులు, ఇతర సంస్థలు నేరుగా టెలికాం కంపెనీల నుండి మొబైల్ నంబర్ చెల్లుబాటును నిర్ధారించగలవు. దీనివల్ల మోసపూరిత లావాదేవీలు (Fake Transactions), నకిలీ సిమ్ కార్డులు, నకిలీ ఖాతాలు తెరవడం వంటి సంఘటనలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిబంధనలు ఏ కంపెనీలకు వర్తించవు?

ఈ నిబంధనలు ఈ-కామర్స్ (E Commerce), ఫుడ్ డెలివరీ లేదా ఇతర ఆన్‌లైన్ వ్యాపార వేదికలకు వర్తించవని DoT స్పష్టం చేసింది. వాటి పరిధి నేరుగా టెలికాం నెట్‌వర్క్‌లు, ఆర్థిక సేవలలో ఉన్న సంస్థలకు మాత్రమే పరిమితం అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.