NanoBanana, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో నానో బ‌నానా 3డీ ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఫేస్‌బుక్‌, ఇన్‌ష్టా, ఎక్స్ ఇలా ఒక్క‌టేమిటి.. ఎక్క‌డ చూసినా ఈ ఫోటోల సంద‌డే క‌నిపిస్తోంది.. అస‌లు ఈ నానో బ‌నానా అంటే చాలా మందికి తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.. మ‌న ఫోటోలో ఉన్న వ్య‌క్తిని కానీ ఏదైనా ఆబ్జెక్ట్‌ 3డీ ఆకారంలో చూపించ‌డ‌మే దీనికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.. అంటే మ‌న ఫోటో ఓ చిన్న స్టాట్యూగా క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. అందుకే ఈ ఫోటో కోసం సోష‌ల్ మీడియాలో క‌నిపించే ప్ర‌తీ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు కొంత మంది.

ఇలాగే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి ఫేస్‌బుక్‌లో వ‌చ్చిన పోటోను చూసి అటువంటి ఫోటో కోసం కిందున్న లింక్‌ను క్లిక్ చేశాడు.. ఇంకేముంది.. ఫోన్ మొత్తం హ్యాక‌ర్ చేతిలోకి వెళ్లిపోయింది.. క‌నీసం ఓటీపీతో ప‌నిలేకుండా ప‌నికానిచ్చేసి ఖాతాలో ఉన్న సుమారు రూ.80 వేలు కాజేశాడు.. ఆత‌రువాత ల‌బోదిబో మంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు...

ట్రెండింగ్‌లో ఉన్న నానా బ‌నానా 3డీ ఫోటో అంటే ఏమిటి..

నానో బనానా అనేది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్‌లో AI ఆధారంగా వచ్చిన ప్రత్యేక ఫోటో ఎడిటింగ్ టూల్‌కు ఆన్లైన్ కమ్యునిటీ ఇచ్చిన సరదా పేరు. ఇది ఫోటోలను కొన్ని సెకన్లలో 3D డిజిటల్ ఫిగురైన్‌లుగా మార్చుతుంది. ఈ టూల్‌తో సృష్టించిన బొమ్మలు అసలు వ్యక్తికి దగ్గరగా, బట్టలు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సహా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో 3D టాయ్‌లా రూపుదిద్దుకుని మ‌న‌కు నిజంగా అక్క‌డ చిన్న‌పాటి ప్ర‌తిమ‌లు ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది.. దీని ద్వారా సాధారణ ఫోటోల్ని నచ్చిన విధంగా మ‌న‌ల్ని మ‌నం లేదా ఇతరుల చిత్రాలను చిన్న ప్లాస్టిక్ బొమ్మలా, వాస్తవిక 3D మోడల్‌గా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ సోషల్ మీడియాలో ఈ మ‌ధ్య బాగా ట్రెండింగ్ అవుతోంది.

ఇలా చేయాలి.. కానీ అవాంఛిత లింక్‌లు క్లిక్ చేయ‌కూడ‌దు..

గూగుల్ జెమినీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో నానో బ‌నానా ఫీచర్ ఎంపింక చేసుకుని ఒక ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.. ‘ప్రాంప్ట్’లో దాని రూపం ఎలా ఉండాలి, ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలని వివరంగా చెప్ప‌వ‌చ్చు కూడా.. AI వాస్తవికమైన 3D ఫిగ్యూరైన్ ను రూపొందిస్తుంది.. సెలబ్రిటీల నుంచి సాధారణ యూజర్ల వరకూ చాలామంది తమ ఫోటోల్ని 3D మినీ బొమ్మలా మార్చుకుని వాటిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో దీనికి భ‌లే క్రేజ్ పెరిగి ఇది బాగా ట్రెండింగ్‌గా మారింది.. అయితే మ‌న ఫోన్‌కు వ‌చ్చే అవాంఛిత లింక్‌ల‌ను క్లిక్ చేయ‌డం వ‌ల్ల‌నే అస‌లు స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతోంది..

అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే...

నానో బ‌నానా అనే ఫీచ‌ర్ ద్వారా ఫోటోలు రూప‌క‌ల్పన చేయాల‌నుకుంటే మ‌న మొబైల్స్‌లో కానీ ల్యాప్‌టాప్‌ల్లో కానీ జెమిని యాప్ ద్వారా లేదా వెబ్ సైట్‌లో మాత్ర‌మే ఇవి ల‌భ్య‌మ‌వుతాయి.. కానీ సైబ‌ర్ నేర‌గాళ్లు నానో బ‌నానా ఫోటో పేరుతో లింక్‌లు వాట్సాప్‌కు సెండ్ చేస్తున్నారు. అప్ప‌టికే సో\ష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోల‌ను చూస్తున్న‌వారు సుల‌భంగా మ‌నం కూడా ఫోటోలు 3డీల్లోకి మార్చు కోవ‌చ్చ‌న్న కుతూహ‌లంతో ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. క్ష‌ణాల్లో మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ఫోన్‌లో ఏపీకే యాప్‌లు ఇన్‌స్టాల్ అయ్యి మ‌న ఫోన్ అంతా హ్యాక‌ర్ చేతిలోకి వెళ్లిపోతుంది.. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌ఫోన్‌ను ఆప‌రేట్ చేసి త‌న‌కు యూపీఐ యాప్‌ల ద్వారా ఖాతాలో ఉన్న‌దంతా కొల్ల‌గొడుతున్నారు.. అందుకే వాట్సాప్‌ల‌కు వ‌చ్చే తెలియ‌ని లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని టెక్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు..