<p>Sangareddy Crime News | పుల్కల్: రోజులు మారాయంటే ఏంటో అనుకుంటాం. కానీ సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలిస్తే నిజమే అంటారు. తాను తీసుకున్న అప్పు కోసం ష్యూరిటీ అడిగితే ఇవ్వని కారణంగా ఓ యువకుడు తన స్నేహితుడి గొంతు కోసేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. </p>
<p><strong>అసలేం జరిగిందంటే..</strong></p>
<p>సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన మల్లేష్, రాజు స్నేహితులు. ఆర్థిక అవసరాలు పెరగడంతో మల్లేష్ కు డబ్బులు అవసరమయ్యాయి. బయట వేరే వ్యక్తి వద్ద మల్లేష్ రూ.20 వేలు అప్పు తీసుకుంటున్నాడు. అప్పు ఇచ్చేవారు ష్యూరిటీ అడిగారని సంతకం చేయాలని స్నేహితుడు రాజును కోరాడు. అసలే రోజులు మంచిగా లేదు. ఇతరులు డబ్బులు తీసుకుని ఎగ్గొడితే తన మీదకు వస్తుందని భావించిన రాజు ష్యూరిటీ సంతకం పెట్టేందుకు నిరాకరించాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా సంతకం చేయడానికి రాజు ఒప్పుకోకపోవడంతో మల్లేష్ గొడవపడ్డాడు. సంతకం పెట్టేందుకు నిరాకరిస్తావా అంటూ కత్తితో స్నేహితుడు రాజు గొంతు కోశాడు మల్లేష్. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేష్ ను అరెస్ట్ చేశారు. బాధితుడు రాజును సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. </p>