అమరావతి: గృహ హింస కేసులు కేవలం సామాన్యులకే పరిమితం కాలేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన, వారి సమస్యలు తీర్చే బాధ్యత కలిగిన హోదాలో ఉన్న అధికారులు, నేతలు సైతం తప్పులు చేస్తూ కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా తన భార్యపై దాడి చేసి రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీపై కేసు నమోదైంది. ప్రేమ వివాహం చేసుకున్న ఆ అధికారి భార్యపై దాడి చేసి కొట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే..
కిరణ్‌కుమార్‌ స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయన కొన్నేళ్ల కిందట అనసూయరాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరు పోస్టల్‌ కాలనీలో ఉంటున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి గొడవకు దారితీయడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మరోసారి కిరణ్ కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన డీఐజీ కిరణ్ కుమార్ తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆమె స్పృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు అనసూయరాణిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న అనసూయరాణి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో తన భర్త కిరణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. మీడియాతో బాధితురాలు మాట్లాడుతూ.. తనపై దాడి చేస్తున్నాడని, పిల్లలు పుట్టలేదని వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. పిల్లలు కలగకపోవడంతో మొదట ఓ పాపను దత్తత తీసుకున్నాం. ఆ తరువాత 2012లో సరోగసి ద్వారా బాబు జన్మించాడని తెలిపారు. పాప ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడని బాధితురాలు పోలీసులకు వెల్లడించారు. కొంత కాలం నుంచి భర్త పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, తనను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కొన్ని రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని తనను, బాబును కూడా కొట్టారని అందుకే ఫిర్యాదు చేసినట్లు భార్య అనసూయరాణి తెలిపారు.