Vizianagaram Latest Crime News: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ పరిధి చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు లోకేష్‌(18) విజయనగరంలో మృతి చెందాడు. లోకేష్‌ది హత్యా లేక ఆత్మహత్యా అనేది మిస్టరీగా మారింది. అందరితో కలివిడిగా, మంచిగా ఉండే లోకేష్‌ మృతి అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తోంది. 26వ తేదీ వేకువజామున రూమ్‌లో ఉరికి వేలాడుతూ లోకేష్ కనిపించాడు. ముక్కోణపు ప్రేమకథలో ఓడిపోయి లోకేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా భావిస్తున్నా ఇదే లవ్‌స్టోరీ లోకేష్‌ ప్రాణాలు తీసిందా అనే అనుమానం కూడా ఉంది.

చిన్నరావుపల్లి గ్రామానికి లోకేష్‌ తాపీమేస్త్రి కుమారుడు. అమ్మ కూలీ పనులు చేస్తూ ఉంటుంది. లోకేష్ రెండో వాడు. పెద్దకుమారుడు సంతోష్‌ డిగ్రీ పూర్తై ఉద్యోగ వేటలో ఉంటూనే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి పార్టీ అభ్యర్థి ఈశ్వరరావు గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాడు. గ్రామాభివృద్ధిలో, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుంటున్నాడు.

రెండో కుమారుడు లోకేష్‌కు మంచి భవిష్యత్తును అందివ్వాలన్న ఆశతో తల్లిదండ్రులు ఇంటర్మీడియట్‌ నుంచి హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఇంటర్‌ పూర్తైన లోకేష్‌ విజయనగరంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఒక వైపు డిగ్రీ చదువుతూనే.. మరోవైపు కాంపిటేటివ్‌ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. క్లాస్‌మేట్స్‌తో కలిపి రూమ్‌లో ఉంటూ చదువుతున్నాడు.

26న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నయ సంతోష్‌కు స్నేహితుల నుంచి ఫోన్‌ వచ్చింది. మీ తమ్ముడు లోకేష్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, రండి అంటూ చెప్పారు. ఒక్కసారిగా షాక్‌ గురై కుటుంబ సభ్యులు విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని భావించి అక్కడి స్థానిక విజయనగరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడు లోకేష్‌ స్నేహితులు, సెల్‌ ఫోన్‌లో లభించిన ఆధారాలను బట్టి ఆరా తీశారు. 25న అంటే మంగళవారం రాత్రి 1.30 నుంచి 3 గంటల సమయంలో మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పంచనామా నిర్వహించిన వైద్యులు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థిని లోకేష్‌ ఇష్టపడినట్టుగా గుర్తించారు. మరో యువకుడు కూడా అదే అమ్మాయిని లవ్‌ చేస్తున్నాడని స్నేహితులు ద్వారా తెలుసుకున్నారు. ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో లోకేష్‌ మృతి మిస్టరీగా మారింది. లోకేష్‌ను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోకేష్‌ ఉరి వేసుకునే చీర ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు వచ్చేసరికి డెడ్‌ బాడీని కిందకి దించేయడం వెనుక మర్మం ఏంటి? వైర్‌/తాడుతో గొంతు బిగించినట్టుగా ఆనవాలు స్పష్టంగా ఉన్నా, కొక్కానికి మాత్రం చీర ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కాళ్లను కట్టినట్టుగా గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు. లోకేష్‌ ఉరి వేసుకుంటే కాళ్లు నేలకు ఆనేటంత పొడుగు ఉంటాడు. మరి పొడువైన చీరతో వేలాడుతూ ఎలా ఉన్నాడు? మృతి చెందే సమయంలో స్నేహితులు లేకపోవడం, ఫోన్‌లు చేస్తే పొంతనలేని సమాధానాలు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలోనే విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నరావుపల్లిలో విషాద ఛాయలు
అన్నెపు లోకేష్‌ మృతదేహం గురువారం చిన్నరావుపల్లి చేరుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు లేడని ఇక రాడని తలుచుకొని తల్లి చేస్తున్న ఆర్తనాధాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నరావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.