Bengaluru woman Molestation | బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో గురువారం అర్ధరాత్రి దారుణం జరిగింది. పరిచయస్తుడే కదా అని నమ్మి వెళ్లిన వివాహితపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని కోరమంగళ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే ఛేదించారు.

అసలేం జరిగిందంటే..
దాదాపు 33-35 ఏళ్ల వయసున్న వివాహిత క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుంది. ఢిల్లీకి చెందిన మహిళ తన భర్తతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో జ్యోతి నివాస్‌ కాలేజీ జంక్షన్‌ వద్ద వెయిట్ చేస్తున్న మహిళను గురువారం నలుగురు యువకులు పలకరించారు. అనంతరం యువకులు డిన్నర్‌కు పిలిస్తే పరిచయం ఉన్న వారేనని వివాహిత వారితో పాటు హోటల్‌కు వెళ్లింది. డిన్నర్ కంప్లీట్ అయ్యాక యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా హోటల్‌ టెర్రస్ మీదకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పరిచయం ఉందని నమ్మి వచ్చిన మహిళపై ఒకరి తర్వాత ఒకరు ఆ యువకులు రాత్రంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆమెను వదిలేశారు. ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామని సైతం బెదిరించారు.

ఉదయం ఇంటికి వెళ్లిన వివాహిత తన భర్తకు రాత్రి జరిగిన దారుణం గురించి చెప్పింది. భర్తతో కలిసి ఎమర్జెన్సీ నెంబర్ 112కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దారుణంపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని కోరమంగళ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను గుర్తించారు. విశ్వాస్, అజిత్, శివు, మరో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితులంతా దాదాపు 20 ఏళ్ల వయసున్న వారే. వీరిలో ముగ్గురు నిందితులు పశ్చిమ బెంగాల్ వారు, కాగా ఒకడు ఉత్తరాఖండ్ నుంచి బెంగళూరుకు వచ్చి పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

నిందితులు అరెస్ట్

వివాహితపై సామూహిక అత్యాచారం ఘటనపై బెంగళూరు సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్‌ సారా ఫాతిమా స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30 - 8 గంటలకు మాకు ఫిర్యాదు అందింది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసిన కోరమంగళ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలని హాస్పిటల్‌కు తరలించి మెడికల్ టెస్టులు చేపించాం. మహిళ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె తన ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నిందితులు సైతం తమ ఫ్రెండ్‌ను కలిసేందుకు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వారు ఆమెతో మాటలు కలిపి డిన్నర్‌కు ఆహ్వానిస్తే వెళ్లింది. డిన్నర్ తరువాత ఆమెను హోటల్ మీదకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపినట్లు చెప్పారు.

నిందితులతో మహిళకు ఉన్న పరిచయాలపై విచారణలో తేలుతుందన్నారు. నిందితులు మద్యం సేవించి ఉన్నారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిందితులు హోటల్స్‌లో చెఫ్, హెల్పర్, వెయిటర్లుగా పనిచేస్తున్నారు. మహిళ కూడా క్యాటరింగ్ వర్క్ చేస్తోంది. వీరికి జాబ్ రీత్యా పరిచయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.