Anupama Parameswaran Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'క్రేజీ కళ్యాణం'. 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్ హీరో. హీరోయిన్ (అనుపమ) అక్కను పెళ్ళి చేసుకున్న బావగా తరుణ్ భాస్కర్, తండ్రిగా నరేష్ విజయకృష్ణ, కీలక పాత్రలో కిరీటి దామరాజు నటించారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మెహన్ రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Crazy Kalyanam Story): పర్వతాలు (నరేష్ విజయకృష్ణ) పెద్దల్లుడు బాల్ రాజ్ (తరుణ్ భాస్కర్)కు పనీ పాట లేదు. ఇల్లరికం వచ్చాడు. ప్రతి రోజూ రాత్రి అయ్యేసరికి ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి తాగడం వల్ల ఊళ్ళో మర్యాద లేకుండా పోతోందని పర్వతాలు బాధ పడుతుంటాడు. చిన్న కుమార్తె కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి పెళ్ళి చేసి పోయిన తన మర్యాదను తిరిగి రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఓ సాఫ్ట్‌వేర్ (కిరీటి దామరాజు) సంబంధం వస్తుంది.

కీర్తికి ఉద్యోగం చేయాలని, తన కాళ్ళ మీద నిలబడాలని కోరిక. చిన్ననాటి క్లాస్‌మేట్ ఉదయ్ (అఖిల్ రాజ్)తో ప్రేమలో ఉంటుంది. తండ్రి తీసుకొచ్చిన సంబంధం చేసుకుందా? లేదంటే తన ప్రేమ సంగతి తండ్రికి చెప్పిందా? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Crazy Kalyanam Review Telugu): 'క్రేజీ కళ్యాణం' టైటిల్‌లో స్టోరీ మెయిన్ పాయింట్ గురించి హింట్ ఇచ్చారు. అయితే... ఆ క్రేజీ కళ్యాణం కాన్సెప్ట్ తెరపైకి రావడానికి టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు వరకు కథ, ఆ కథలోని క్యారెక్టర్లను పరిచయం చేశారు. విశేషం ఏమిటంటే... ఆ స్టోరీ సెటప్ & సీన్స్ బావున్నాయి. కథను కేవలం కళ్యాణం చుట్టూ తిప్పలేదు. కథానాయిక పాత్ర, ఆమె ఆలోచనలను చూపించిన తీరు బావుంది.

సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో అమ్మాయికి ఓ వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసి అత్తారింటికి పంపించాలని అనుకుంటారు. అందులోనూ ఓ అల్లుడు అప్రయోజకుడు కావడం వల్ల నిందలు పడుతున్న సమయంలో మరో అమ్మాయికి మంచి సంబంధం చేయాలని అనుకోవడం సహజం. అయితే... ఇక్కడ ఎలాగైనా మంచి సంబంధం చేయాలని తాపత్రయ పడే తండ్రి, ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద నిలబడాలని ప్రయత్నించే కుమార్తె మధ్య ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ బావుంది. అప్పటి వరకు చూపించిన కథలోని సన్నివేశాల్లో వినోదమూ కాస్త నవ్వించింది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ పాత్రను తెలంగాణలో పలు పల్లెల్లో ఇల్లరికం వచ్చిన ఎటువంటి పని పాట చేయని అల్లుళ్లకు ప్రతిబింబంగా ఉంది. ఆ సీన్స్ వర్కవుట్ అయ్యాయి కూడా! అయితే... కథలో అసలు సమస్య పెళ్ళి మొదలైన తర్వాతే వచ్చింది.

Also Read: Vijay Deverakonda Ranabaali Review - 'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?

'క్రేజీ కళ్యాణం' మొదలైన తర్వాత వినోదం తగ్గింది. ఎమోషనల్ ట్రాక్‌లోకి వెళ్ళింది. అయితే... ఎలాగైనా సరే అమ్మాయి పెళ్ళి చేయాలని తండ్రి చేసే ఓ పని మాత్రం అందరూ హర్షించేలా లేదు. కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని తెలిశాక తండ్రితో వచ్చే మార్పు కూడా యాక్సెప్ట్ చేసేలా లేదు. పెద్దల్లుడిని పొగిడే సన్నివేశం కూడా! ఉన్నట్టుండి వచ్చిన మార్పు కాస్త షాక్ ఇస్తుంది. అయితే... దర్శకుడు బద్రప్ప గాజుల రచనలో కొన్ని సన్నివేశాలు మాత్రం మనసును తాకుతాయి. ముఖ్యంగా ఆస్తి పత్రాల మీద సంతకం చేయించే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. కథలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బావున్నాయి. కామెడీ కూడా! అయితే... కాస్త నిడివి ఎక్కువైంది. కథలో అసలైన క్రేజీ కళ్యాణం ఆకట్టుకునేలా లేదు. అయితే అక్కడ నటీనటుల ప్రతిభ ఆకట్టుకుంటుంది.

తెలంగాణ నేటివిటీని దర్శకుడు బద్రప్ప గాజుల చక్కగా చూపించారు. కెమెరా & మ్యూజిక్ డిపార్ట్‌మెంట్స్‌ నుంచి మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నాడు. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం కథకు ప్రాణం పోశాయి. సాహిత్యం కూడా బావుంది. నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి ఖర్చుకు వెనుకాడలేదు.

Also Read: Jailer 2 Review In Telugu - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?

కథంతా అనుపమ పరమేశ్వరన్ చుట్టూ తిరిగినా... 'క్రేజీ కళ్యాణం' చూశాక నరేష్ వీకే నటన ఎక్కువ గుర్తుంటుంది. కళ్యాణం సన్నివేశాల్లో ఆయన అదరగొట్టారు. నవరసాలు పలికించారు. అనుపమ సైతం అద్భుతంగా నటించారు. తరుణ్ భాస్కర్ నటన చూస్తే నేచురల్ యాక్టర్ అనిపిస్తుంది. అఖిల్ రాజ్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు తగ్గట్టు చేశారు. కిరిటీ దామరాజును చూస్తే టైప్ కాస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.

Crazy Kalyanam Verdict: కొన్ని నవ్వులు, మంచి పాటలు - నేపథ్య సంగీతంతో తెరకెక్కిన సినిమా 'క్రేజీ కళ్యాణం'. ఇంటర్వెల్ వరకు ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆ తర్వాత కాస్త రొటీన్ ట్రాక్‌లోకి వెళ్ళినా... నటీనటుల ప్రతిభతో క్లైమాక్స్ వచ్చేసరికి గట్టెక్కుతుంది. ఫ్యామిలీ డ్రామాలు, ముఖ్యంగా మహిళలను వంటింటి కుందేళ్ళుగా కట్టేయకుండా వాళ్ళనూ తమ కాళ్ళ మీద నిలబడనివ్వాలని కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.

Also Read: Least Eligible Bachelor Review - 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: రెండు ఓటీటీల్లో 'జబర్దస్త్' బాబు కామెడీ సిరీస్ - హీరోగా హర్ష చెముడు ఏం చేశారంటే?