<p>హైదరాబాద్: ఇండియా (INDIA) కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వేదికగా ఈ సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని పార్టీ నేతలు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, సుమారు ఒక లక్ష మంది ప్రజలతో సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఢిల్లీలో ఇండీ కూటమి ఆందోళన కోసం తెలంగాణ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు హాజరవుతూ సర్ ప్రక్రియతో పాటు సీఈసీకి వ్యతిరేకంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలపై చర్చలు జరుపుతున్నారు.</p>
<p>కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదివరకే తెలిపారు. ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసంలో మంగళవారం నిర్వహించిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సీఈసీ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలో కోట్లాది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఆరోపించారు. గతంలో బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓట్లు తొలగించిన తరువాత బీజేపీ అక్కడ విజయాలు సాధించిందని ఆరోపించారు. మహారాష్ట్రలోనూ గెలిచే అవకాశం లేని అభ్యర్థులు విజయాలు సాధించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లతో పాటు పేదలు, దళితుల ఓట్లు, కొన్ని వర్గాలు ఓట్లను SIR ప్రక్రియ సాకుతో తొలగించి లబ్ధి పొందుతున్నారని మమహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. </p>