TVK CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం నాడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు శుభవార్త అందించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వేదికపైనే ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యాలకు సంబంధించిన ఫైళ్లపై టీవీకే అధినేత విజయ్ తొలి సంతకం చేశారు. సీఎం విజయ్‌తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

సీఎంగా విజయ్ మొదటి రోజు తొలి సంతకం
చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం విజయ్ మూడు ముఖ్యమైన ఫైళ్లపై విజయ్ సంతకాలు చేశారు. అందులో తొలి ఫైల్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించడం కోసం సంతకం చేశారు. మహిళల రక్షణ కోసం 'సింగప్పెన్గళ్' (షీ టీమ్స్ తరహా) ప్రత్యేక దళం, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిరోధక చర్యల కోసం మరో ఫైల్ మీద సీఎం విజయ్ సంతకాలు చేశారు.

విజయ్ జారీ చేసిన 3 ఆదేశాలు ఇవే
తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ శుభవార్త అందించారు. 200 మూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు ఎత్తివేస్తూ తొలి ఫైల్ మీద సంతకం చేశారు. ఇప్పటికే గృహ వినియోగం కోసం 100 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఆ ఉచిత విద్యుత్తు పరిమితిని 200 యూనిట్లకు సీఎం విజయ్ పెంచారు. ఎన్నికల మేనిఫెస్టో సమయంలో విజయ్ ప్రకటించిన ముఖ్యమైన హామీలలో ఉచిత ఒకటిగా భావించే ప్రకటనపై మొదటి రోజే సీఎం విజయ్ సంతకం చేశారు.

మహిళల రక్షణను కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం విజయ్ ప్రకటించారు. దాని ప్రకారం, మహిళల భద్రతను మెరుగుపరచడం కోసం భద్రతా వ్యూహాలే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేసేలా 'సింగప్పెన్' ప్రత్యేక యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు.

డ్రగ్స్ రహిత తమిళనాడు రాష్ట్రం..

తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విజయ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా మాదకద్రవ్యాలు లేని తమిళనాడుగా తీర్చిదిద్దడంలో భాగంగా సామాజిక రక్షకుల పథకం, స్కూల్స్, కాలేజీలలో మాదకద్రవ్యాల నిరోధక క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని టీవీకే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. దాని ప్రకారం, డ్రగ్స్ సంబంధించిన నేరాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అన్ని నగరాలు, జిల్లాల్లో డ్రగ్స్ నిరోధక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు.