Tamil Nadu cm Vijay meeting on delimitation bill | చెన్నై: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, దానివల్ల తమిళనాడుపై పడే ప్రభావంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని మెజారిటీ ఎంపీలు బహిష్కరించి సీఎం విజయ్‌కు షాకిచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి మొత్తం 57 మంది ఎంపీలు ఉండగా (లోక్‌సభ ఎంపీలు 39 మంది, రాజ్యసభ సభ్యులు 18 మంది), సీఎం విజయ్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 37 మంది ఎంపీలు సమావేశానికి గైర్హాజరు కావడం తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్‌కు పెద్ద షాక్‌గా భావిస్తున్నారు.

సమావేశానికి ఏకంగా 37 మంది ఎంపీలు దూరం
సీఎం విజయ్ శనివారం (ఆగస్టు 8న) నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన వారిలో ప్రధానంగా కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలే ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన 12 మంది, విసికె (VCK) నుంచి ఇద్దరు, సిపిఐ (CPI) నుంచి ఇద్దరు, సిపిఎం (CPM) నుంచి ఇద్దరు, ఎండిఎంకె నుంచి ఒకరు, ఐయుఎంఎల్ (IUML) నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తమ ఎంపీలు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తారని డీఎంకే ఇదివరకే ఇప్పటికే స్పష్టం చేసింది. ఏఎన్‌ఐ నివేదిక ప్రకారం, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్ ఆగస్టు 6, 7 తేదీలలో ఎంపీలకు విడివిడిగా ఆహ్వానాలు పంపడం తెలిసిందే. ఈ సమావేశానికి డీఎంకేకు చెందిన 30 మంది ఎంపీలతో పాటు అన్నాడీఎంకే నుంచి నలుగురు, పిఎంకె (PMK) నుంచి ఒకరు, ఎంఎన్ఎం నుంచి ఒకరు, డీఎండీకే (DMDK) నుంచి ఒక ఎంపీ డీలిమిటేషన్‌పై సీఎం విజయ్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి హాజరుకాలేదు.

సమావేశానికి దూరంగా ఉన్న ఎంపీలు కొందరు ఈ అంశంపై స్పందించారు. కావేరీ జలాల వివాదం వంటి కీలక సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి కర్ణాటక, తమిళనాడుల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగడం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకేదాటు ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తుండగా, తమిళనాడు ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని సీఎం విజయ్ ఇదివరకే ప్రతిపాదించారు.

పిటిఐ (PTI) వార్తా సంస్థ నివేదిక ప్రకారం, సీఎం విజయ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తమ పార్టీ ఎంపీలు హాజరుకాబోరని డీఎంకే వర్గాలు ముందే తెలిపాయి. మేకేదాటు ప్రాజెక్టు వివాదంపై ప్రభుత్వం ఆల్‌పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాతే తాము ఈ చర్చల్లో పాల్గొంటామన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి. మరో డీఎంకే ఎంపీ మాట్లాడుతూ.. "నేరుగా ఎంపీలను మాత్రమే ఆహ్వానించడం పెద్ద తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం మొదట పార్టీల అగ్ర నాయకత్వాన్ని చర్చకు పిలవాల్సి ఉంది. ఎంపీల పని పార్టీ వైఖరికి కట్టుబడి ఉండడమే. కనుక డీలిమిటేషన్‌పై సమావేశం ఇలా జరగడం మాకు అనవసరం" అని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాల పునర్విభజనకు కాంగ్రెస్ వ్యతిరేకం
కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ అంశంపై స్పందించారు. ‘తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన రాష్ట్ర ఎంపీలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాలో దాదాపు 21 మంది ఈ సమావేశానికి హాజరయ్యాం. తమిళనాడు హక్కులను కాపాడుకోవాలనే అంశంపై మా అందరి నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. పార్లమెంట్‌లో మా రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి వీల్లేదు. జనాభా ప్రాతిపదికన గానీ లేదా మరే ఇతర కారణంతో గానీ చేసే నియోజకవర్గాల పునర్విభజన, మార్పులను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తామని’ స్పష్టం చేశారు.